BCCI: టెస్టు మ్యాచ్‌లు ఆడితే అదనంగా రూ.45లక్షలు.. ఇన్సెంటివ్‌ స్కీమ్‌ను ప్రకటించిన జైషా

టెస్టులపై ఆటగాళ్లలో ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా మరింత బలోపేతం చేయడం వల్ల ప్రతిఒక్కరూ టెస్టులు ఆడేందుకు ముందుకొస్తారని భావిస్తోంది.

Updated : 09 Mar 2024 16:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టు క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ(BCCI) చర్యలు చేపట్టింది. టీ20 లీగ్‌ల వైపు మొగ్గు చూపే క్రికెటర్లను అడ్డుకొనేందుకు తాజాగా ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ను బీసీసీఐ ప్రవేశపెట్టింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశారు. దీనికోసం రూ.40 కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు కాంట్రాక్ట్‌ ప్లేయర్లు అందుకొన్న ఫీజుతోపాటు అదనంగా ప్రతీ టెస్టు మ్యాచ్‌కు ఇన్సెంటివ్‌గా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టుకే ఇలాంటి స్కీమ్‌ను అమల్లోకి తెచ్చారు.

‘‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. టెస్టు క్రికెట్‌ ఆడేవారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముందడుగు వేశాం. 2022-23 సీజన్‌ నుంచే ఈ స్కీమ్‌ అమల్లోకి వచ్చినట్లే. టెస్టు మ్యాచ్‌ ఆడే ప్లేయర్లకు అదనంగా భత్యాలను చెల్లిస్తాం. అది కనీసం రూ.15 లక్షలు ఉంటుంది’’ అని జై షా పోస్టు చేశారు. బీసీసీఐ కార్యదర్శి చేసిన పోస్టు ప్రకారం.. ఒక సీజన్‌లో కనీసం 50 శాతం కంటే మ్యాచుల్లో ఆడాల్సి ఉంటుంది. రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితమైనప్పటికీ.. స్క్వాడ్‌కు ఎంపికైనా సరిపోతుంది. అంతకంటే తక్కువ ఆడితే మాత్రం ఎలాంటి అదనపు భత్యం దక్కదు. 

ఉదాహరణకు.. ఒక సీజన్‌లో 9 టెస్టులు ఆడారనుకుందాం.. ఎవరైనా ఆటగాడు 4 అంతకంటే తక్కువ మ్యాచ్‌ల్లో పాల్గొంటే ఎలాంటి ఇన్సెంటివ్‌ రాదు. అదే 50 శాతం కంటే ఎక్కువ అంటే 5-6 టెస్టుల్లో ఆడితే ప్రతీ మ్యాచ్‌కు కనీసం రూ.15 లక్షలు దక్కుతాయి. తుది జట్టులో ఉంటే రూ.30 లక్షలు ఇస్తారు. ఒకవేళ 7 కంటే ఎక్కువ (75 శాతం) టెస్టుల్లో ఆడి తుది జట్టులో ఉంటే ప్రతీ మ్యాచ్‌కు రూ.45 లక్షలు దక్కుతాయి. రిజర్వ్‌బెంచ్‌కు పరిమితమైనా సరే రూ.22.5 లక్షలు వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని