Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Mar 2024 21:02 IST

1. భాజపా  రెండో జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు 72 మందితో రెండో జాబితాను భాజపా  (BJP) విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. ఆదిలాబాద్‌ - గోడెం నగేశ్‌, పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్‌, మెదక్‌ - రఘునందన్‌రావు, నల్లగొండ - శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌కు సీతారాం నాయక్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వరంగల్‌, చేవెళ్ల భారాస అభ్యర్థులు ఖరారు

లోక్‌సభ ఎన్నికల్లో మరో రెండు స్థానాలకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్‌ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను భారాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశమైన అనంతరం అభ్యర్థిత్వాలను ప్రకటించారు. ఈ రెండు చోట్లా భారాసకు సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఇతరులకు అవకాశం కల్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు..

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు కొనసాగుతోంది. గాంధీభవన్‌లో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ బుధవారం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపదాస్‌ మున్షీ, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, మన్సూర్‌ అలీఖాన్, విష్ణునాగ్‌లు.. నేతల అభిప్రాయలను తీసుకుంటున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 16న వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఈనెల 16న విడుదల చేయనున్నట్టు వైకాపా ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు సమన్వయకర్తల పేరుతో వైకాపా 12 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాష్ట్రాల సంఘాలు విదేశీ బోర్డులతో నేరుగా సంబంధాలు పెట్టుకోకూడదు : బీసీసీఐ

విదేశీ బోర్డులతో నేరుగా సంబంధాలు పెట్టుకోకుండా రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలను నిరోధించడానికి బీసీసీఐ(BCCI) సిద్ధమవుతోంది. శిక్షణ శిబిరాలు, పోటీలను నిర్వహించేందుకు విదేశీ బోర్డులతో నేరుగా సంప్రదించకూడదని.. అలాంటి ప్రతిపాదనలన్నీ బీసీసీఐ ద్వారానే జరగాలని అది కోరుకుంటోంది. మార్చి 18న జరిగే సమావేశంలో దీనికి సంబంధించి బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈవీల కోసం కేంద్రం కొత్త స్కీమ్‌.. టూవీలర్లపై గరిష్ఠ సబ్సిడీ ఇదే..

విద్యుత్తు వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాయితీ అందించేందుకు ఇ-మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ (EMPS 2024)ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్‌ పాండే (Mahendra Nath Pandey) బుధవారం వెల్లడించారు. ఈ పథకం కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రూ.100 కోట్ల పన్ను వివాదం.. హైకోర్టులోనూ కాంగ్రెస్‌కు షాక్‌

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆదాయపు పన్ను వివాదం (Tax demand case)లో కాంగ్రెస్‌ (Congress)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమంటూ హస్తం పార్టీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎన్నికలకు మేం సిద్ధం.. గడువులోగా ‘బాండ్ల’ వివరాలు వెల్లడిస్తాం : సీఈసీ

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను గడువులోగా బహిర్గతం చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఎస్‌బీఐ నుంచి ఆ సమాచారం అందిన విషయాన్ని ధ్రువీకరించారు. సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల ప్రకారం, మార్చి 15 సాయంత్రంలోగా వీటిని ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌ 64 ఏళ్ల కల ఇప్పటికి సాకారమైంది: ప్రధాని మోదీ

దేశ భవిష్యత్తు అవసరాలు, ప్రాధాన్యాలను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ (PM Modi) విమర్శించారు. అందువల్లే దేశంలో సెమీకండక్టర్‌ (Semiconductor) తయారీ పరిశ్రమలు నెలకొల్పడంలో జాప్యం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 36 ఏళ్ల నాటి కేసు.. ముక్తార్‌ అన్సారీకి జీవిత ఖైదు

మాఫియా డాన్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముక్తార్‌ అన్సారీ.. 36 ఏళ్ల నాటి ఓ కేసులో దోషిగా తేలాడు. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ వారణాసిలోని ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ/ఎమ్మెల్యేల కోర్టు) తీర్పు వెలువరించారు. నిబంధనలు ఉల్లంఘించి డబుల్‌ బారెల్‌ తుపాకీ లైసెన్సు పొందిన కేసులో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని