PM Modi: భారత్‌ 64 ఏళ్ల కల ఇప్పటికి సాకారమైంది: ప్రధాని మోదీ

భారత్‌లో సెమీకండక్టర్‌ ప్లాంట్‌ నెలకొల్పాలని 1960 నుంచి ప్రయత్నాలు జరిగాయని, 64 ఏళ్ల తర్వాత ఇప్పటికి అది సాకారమైందని ప్రధాని మోదీ అన్నారు. 

Updated : 13 Mar 2024 18:35 IST

దిల్లీ: దేశ భవిష్యత్తు అవసరాలు, ప్రాధాన్యాలను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ (PM Modi) విమర్శించారు. అందువల్లే దేశంలో సెమీకండక్టర్‌ (Semiconductor) తయారీ పరిశ్రమలు నెలకొల్పడంలో జాప్యం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. బుధవారం రూ.1.25 లక్షల కోట్లు విలువైన సెమీకండక్టర్‌ ప్లాంట్‌లకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులోభాగంగా గుజరాత్‌లో రెండు, అస్సాంలో ఒకటి ఏర్పాటుకానున్నాయి. 

‘‘తొలిసారిగా 1960లో సెమీ కండక్టర్ల తయారీ కోసం భారత్ కలలు కన్నది. అప్పటినుంచి దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు వాటి ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోయాయి. భవిష్యత్తు అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టలేకపోవడంతో ఈ రంగంలో భారత్‌ చాలా వెనకబడింది. కానీ, మా ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా సెమీకండక్టర్ల తయారీకి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రమే వీటిని తయారుచేస్తున్నాయి. 21వ శతాబ్దం సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్‌ చిప్‌ లేని గ్యాడ్జెట్స్‌ను ఊహించడం కష్టం. మేడిన్‌ ఇన్‌ ఇండియా, డిజైన్‌ ఇన్‌ ఇండియా చిప్‌ ఎంతో దూరంలో లేదు. ఇతరులపై ఆధారపడకుండా భారత్‌ స్వయంసమృద్ధిగా ఎదగడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది’’ అని ప్రధాని తెలిపారు. 

భాజపా అధికారంలోకి వచ్చాక.. రక్షణ, బీమా, టెలికాం రంగంలో ఎఫ్‌డీఐలను ఆకర్షించేందుకు సరళతరమైన విధివిధానాలు రూపొందించినట్లు ప్రధాని తెలిపారు. ప్రస్తుతం మొబైల్‌ తయారీలో భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా నిలిచేందుకు ఇవి ఎంతో దోహదం చేశాయన్నారు. సెమీ కండక్టర్‌ పరిశ్రమల ద్వారా దేశ యువత అధికంగా లబ్ధి పొందుతారని తెలిపారు. ఏఐ మిషన్‌లో భాగంగా సరికొత్త ఆవిష్కరణల కోసం భారత్‌ పనిచేస్తోందని, సాంకేతిక అభివృద్ధితోపాటు దాన్ని అమలుచేయడంపైనా కేంద్రం దృష్టి సారించిందన్నారు. 

2026 కల్లా తొలి దేశీయ చిప్

2029 కల్లా ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్లు తయారుచేస్తున్న తొలి ఐదు దేశాల్లో భారత్‌ ఉంటుందని కేంద్ర టెలికాం, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. గుజరాత్‌లోని ధోలేలో  జరిగిన సెమీకండక్టర్‌ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026 కల్లా తొలి దేశీయ చిప్‌ టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఈ ప్లాంట్‌ ద్వారా 27 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని