డిసెంబర్‌ 25న రైతులతో ప్రధాని భేటీ!

మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్‌ 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో ముచ్చటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 2500లకు పైగా ప్రాంతాల్లో కిసాన్‌ సంవాదక్‌ కార్యక్రమాలను....

Updated : 20 Dec 2020 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న వేళ వాటిపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించిన భాజపా ఈ మేరకు చర్యలను ముమ్మరం చేసింది. మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్‌ 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో ముచ్చటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 2500లకు పైగా ప్రాంతాల్లో కిసాన్‌ సంవాదక్‌ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు భాజపా వర్గాలు పేర్కొన్నాయి. రైతులతో ప్రధాని మోదీ భేటీ కానున్న నేపథ్యంలో యూపీ భాజపా చీఫ్‌ స్వతంత్ర దేవ్‌ సింగ్‌, పార్టీ నేత రాధామోహన్‌ సింగ్‌లు కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సంస్కరణలు తెచ్చి ఉంటే ఇప్పటికే రైతుల పరిస్థితి మెరుగ్గా ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు నేటితో 25వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలో సైతం రైతులు పట్టువిడవకుండా నిరసనదీక్షలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత చట్టాలతో ఎటువంటి నష్టం జరగదని, రైతులు లాభపడేందుకే చట్టాలను అమలు చేశామని కేంద్రం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే రైతులు, ప్రభుత్వానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ సఫలం కాలేదు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనలు ప్రారంభమైన తర్వాత పలు కారణాలతో 33 మంది రైతులు మృతిచెందారు. నేడు ఆ అమరవీరులకు రైతు సంఘాలు శ్రద్ధాంజలి ఘటించాయి. సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ వద్ద రైతు సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సభలు, మానవహారాలకు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లు నెరవేరేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశాయి. మరోవైపు నేటి మధ్యాహ్నం 2 గంటలకు సింఘు సరిహద్దుల్లో రైతు సంఘాల భేటీ కానున్నాయి. సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి. అనంతరం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ద్వారా నిర్ణయాలు వెల్లడించనున్నాయి.

ఇవీ చదవండి...

వ్యవసాయ చట్టాల కాపీలను చించేసిన కేజ్రీవాల్‌

ఆ చట్టాలను రాత్రికి రాత్రే రూపొందించలేదు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని