తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది.

Published : 10 May 2024 05:38 IST

 ‘సందేశ్‌ఖాలీ’పై కొత్త వీడియోలు బయటపెట్టిన టీఎంసీ
అవి కల్పితం.. కోర్టును ఆశ్రయిస్తాం : భాజపా 

కోల్‌కతా, దిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. కొందరు మహిళల చేత తెల్లకాగితాలపై సంతకాలు చేయించిన భాజపా మహిళానేత (పియాలీ దాస్‌) వాటినే అత్యాచార ఫిర్యాదులుగా మార్చారని టీఎంసీ నేతలు గురువారం ఆరోపించారు. భాజపా కుట్రకు ఆధారమంటూ స్థానిక కమలం పార్టీ నాయకుడైన గంగాధర్‌ వ్యాఖ్యలతో మూడు రోజుల కిందట శూలశోధన వీడియోను విడుదల చేసిన టీఎంసీ.. తన తాజా వాదనకు మద్దతుగా మరికొన్ని వీడియోలను బయటపెట్టింది. భాజపా నేతలు తమను మభ్యపెట్టి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారని, అత్యాచారాలు జరిగినట్లు తప్పుడు ఫిర్యాదులుగా వాటిని మార్చినట్లు ‘బాధిత’ మహిళలు చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోల్లో ఉన్నాయి. సందేశ్‌ఖాలీ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్న బశీర్‌హాట్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రేఖాపాత్ర ఆ మహిళలతో మాట్లాడుతున్న వీడియో కూడా ఇందులో ఉంది. ఈ వీడియోలు తాము బయటపెట్టాక ‘బాధిత’ మహిళలకు భాజపా నేతల నుంచి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని టీఎంసీ పేర్కొంది. కాగా, తాజా వీడియోల ఆధారంగా స్థానిక పోలీసులు భాజపా మహిళానేత పియాలీ దాస్‌ను విచారణకు పిలిచారు. టీఎంసీ ఆరోపణలను ఖండించిన రాష్ట్ర భాజపా నేత సువేందు అధికారి.. ఆ వీడియోలు ‘భాయిపొ’ (సీఎం మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ) సృష్టి అని కొట్టిపారేశారు. హానికరమైన అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నవారిపై తాము త్వరలో కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

భాజపాపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

సందేశ్‌ఖాలీ అత్యాచార ఘటనలు కల్పితమని, ఈ విషయాన్ని స్వయానా భాజపా నేత కెమెరా ముందు అంగీకరించారంటూ టీఎంసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ కుట్ర వెనుక ఉన్న రాష్ట్ర భాజపా నేత సువేందు అధికారితోపాటు ఇతరులపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేలా పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కోరింది. ఈ మేరకు టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సాగరికా ఘోష్‌ గురువారం ఈసీకి లేఖ సమర్పించారు. షేక్‌ షాజహాన్‌ (టీఎంసీ బహిష్కృత నేత), శిబు హజ్రా, ఉత్తమ్‌ సర్దార్‌లపై తప్పుడు అత్యాచార ఆరోపణలు చేయడం ద్వారా భాజపా నేతలు దారుణమైన కుట్రకు పాల్పడి సమాజాన్ని తప్పుదోవ పట్టించారని లేఖలో పేర్కొన్నారు. సందేశ్‌ఖాలీపై వందతులు వ్యాప్తి చేస్తున్న భాజపా నేతలు దీనిపై మరెక్కడా మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఓ వార్తాసంస్థ శూలశోధన జరిపి చిత్రీకరించిన వీడియోను ‘ఎక్స్‌’ ద్వారా షేర్‌ చేసిన టీఎంసీ.. ఆ వీడియో ఆధారంగానే ఈ ఫిర్యాదు చేసింది. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఆదేశాల మేరకే తప్పుడు లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసినట్లుగా స్థానిక భాజపా నేత గంగాధర్‌ కోయల్‌ చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని