ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది.

Updated : 10 May 2024 06:10 IST

కేజ్రీవాల్‌ బెయిల్‌ను వ్యతిరేకించిన ఈడీ
సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదని తెలిపింది. ఈ మేరకు ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ గురువారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం చేసే హక్కు అనేది.. ప్రాథమిక, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కిందకు రాదు. మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదు. చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికైనా సరే ఆ వెసులుబాటు లభించలేదు. గతంలో మేం సమన్లు జారీ చేసిన సమయంలోనూ కేజ్రీవాల్‌ ఇలాంటి కారణాలే చూపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరు చెప్పి విచారణకు రాలేదు. ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే ఏ రాజకీయ నేతను అరెస్టు చేయలేం. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచలేం. రాజకీయ నాయకులు సామాన్య పౌరుల కంటే ఎక్కువ కాదు, చట్టం ముందు అందరూ సమానమే’’ అని ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ జారీపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించనుంది. ఒకవేళ బెయిల్‌ మంజూరు చేస్తే సీఎంగా అధికారిక విధులు నిర్వహించకూడదని తెలిపింది. దీంతో బెయిల్‌పై ధర్మాసనం సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

నేడు కేజ్రీవాల్‌పై ఈడీ ఛార్జ్‌షీట్‌

అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఈడీ తొలి ఛార్జ్‌షీట్‌ రూపొందిస్తున్నట్లు సమాచారం. దీన్ని శుక్రవారం కోర్టులో సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ తొలిసారి నిందితుడిగా పేర్కొననున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయనను ‘కీలక కుట్రదారు’గా పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు