‘తట్టు’కొనేదెలా?

భారత్‌లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 10 May 2024 05:38 IST

ఒక్క డోసు టీకా కూడా పొందని చిన్నారులు 12 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: భారత్‌లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఆందోళనకర లోటును ఇది తేటతెల్లం చేస్తోందని వివరించింది. ఇలాంటి జీరో డోసు కేసులు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా నాగాలాండ్‌లో అవి 26 శాతంగా ఉన్నట్లు వివరించింది. అత్యంత తక్కువగా తమిళనాడులో ఇది 4.6 శాతంగా ఉంది. తట్టు.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌. ప్రధానంగా చిన్నారుల్లో వస్తుంది. ఇది ఉద్ధృతంగా ఇతరులకు వ్యాపిస్తుంది. దీనిబారిన పడిన వారిలో తీవ్ర జ్వరం, దగ్గు, ముక్కు కారడం, శరీరమంతా దద్దుర్లు రావడం కనిపిస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌తో అనారోగ్యంపాలయ్యే ముప్పును తప్పించుకోవడానికి, వ్యాధి కట్టడికి మెరుగైన సాధనం టీకా. భారత్‌లో తట్టు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిపై ఓ అధ్యయనం చేశారు. ఇందుకోసం 2-3 ఏళ్ల వయసున్న 43వేల మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21లో భాగంగా ఈ డేటాను సేకరించారు. దీని ప్రకారం..

  • తట్టు టీకాను 30 శాతం మంది పిల్లలు ఒక్క డోసు మాత్రమే పొందారు. 60 శాతం మంది రెండు డోసులనూ పొందారు.
  • అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్‌ జిల్లాలో అర్హులైన చిన్నారుల్లో 50 శాతం మంది ఒక్క డోసు కూడా పొందలేదు.
  • కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా తలెత్తిన ఇబ్బందుల వల్ల.. దుర్బల వర్గాలకు తట్టు ముప్పు పెరిగింది. కొవిడ్‌ అనంతరం పరిస్థితులు చక్కబడ్డాక టీకా కార్యక్రమాలను దశలవారీగా పునరుద్ధరించారు. అయితే ఒక్క డోసు కూడా పొందని చిన్నారుల వల్ల.. ఈ ఇన్‌ఫెక్షన్‌ కట్టడి కష్టమవుతోంది.
  • తట్టు టీకాలు పొందకపోవడానికి సామాజికపరమైన అనేక అంశాలు కారణమవుతున్నాయి. కుటుంబంలో చివరి సంతానం ఒక్క డోసు కూడా పొందకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.
  • ఆర్థిక పరిస్థితి, తల్లి చదువు వంటివి కూడా వ్యాక్సినేషన్‌పై ప్రభావం చూపుతున్నాయి. దుష్ప్రచారం, కుటుంబ సంస్కృతి కారణంగా టీకాల పట్ల విముఖత కూడా ఇందుకు కారణమవుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు