పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం

భారత్‌-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌ స్పష్టం చేశారు.

Published : 10 May 2024 05:36 IST

 మాల్దీవుల మంత్రితో జైశంకర్‌ స్పష్టీకరణ

దిల్లీ: భారత్‌-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌కు స్పష్టం చేశారు. ఆరు నెలల క్రితం చైనా అనుకూలుడైన మహ్మద్‌ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడైనప్పటి నుంచి ఆ దేశంతో మన దేశ ద్వైపాక్షిక సంబంధాలు తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో జైశంకర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌ పర్యటనకు వచ్చిన మూసా జమీర్‌తో దిల్లీలో జై శంకర్‌ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాము పొరుగు వారికి ప్రథమ ప్రాధాన్యం (నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ పాలసీ) విధానానికి కట్టుబడి ఉన్నామని, మాల్దీవులకు అవసరం ఉన్న ప్రతిసారీ ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జైశంకర్‌ ఎక్కడా చైనా పేరు ప్రస్తావించలేదు. ముయిజ్జు పగ్గాలు చేపట్టిన తర్వాత మాల్దీవుల నుంచి భారత్‌కు తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం గమనార్హం. మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని ముయిజ్జు కోరిన విషయం తెలిసిందే. అందుకు ఆయన ఈ నెల 10వ తేదీని గడువుగా విధించారు. అది సమీపించిన తరుణంలో ఇరుదేశాల మధ్య సమావేశం జరుగుతుండడం గమనార్హం. అక్కడున్న సైనికుల్లో చాలామందిని భారత్‌ ఇప్పటికే వెనక్కి రప్పించింది. ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి మాల్దీవులు కీలక భాగస్వామి. జమీర్‌ పర్యటన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని