కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు

ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్‌ గురువారం పేర్కొంది.

Published : 10 May 2024 05:32 IST

నిజ్జర్‌ హత్యకేసుపై భారత్‌ స్పందన

దిల్లీ: ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్‌ గురువారం పేర్కొంది. ఈ అంశంలో నిర్దిష్టంగా ఎలాంటి ఆధారాలను, సమాచారాన్ని మాత్రం అందించలేదని తెలిపింది. అందుకే ఈ వ్యవహారంలో ముందే ఒక అభిప్రాయానికి వస్తున్నారని తాము చెబుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. నిజ్జర్‌ హత్య కేసులో కరణ్‌ప్రీత్‌ సింగ్‌ (28), కమల్‌ప్రీత్‌ సింగ్‌ (22), కరణ్‌ బ్రార్‌ (22)లను కెనడా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారు విద్యార్థి వీసాపై కెనడాలోకి ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి. ‘‘ఈ కేసులో రాజకీయ ప్రయోజనాలు పనిచేస్తున్నట్లున్నాయి. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను ప్రేరేపించేవారికి రాజకీయ వేదికలు కల్పించొద్దని మేం చాలా కాలంగా కోరుతున్నాం. కెనడాలో మా దౌత్యవేత్తలను బెదిరిస్తున్నారు. వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ భారత్‌తో సంబంధాలు ఉన్నవారు కెనడాలో ప్రవేశించడానికి, అక్కడ నివసించడానికి అనుమతిస్తున్నారు. నేరగాళ్ల అప్పగింత కోసం ఆ దేశానికి అనేక విజ్ఞప్తులు చేశాం. అవి అక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అంశాలన్నింటిపై కెనడాతో దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నాం’’ అని రణధీర్‌ పేర్కొన్నారు. గతేడాది జులై 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో నిజ్జర్‌ హత్య జరిగింది. దీనివెనక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వాటిని సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని