వ్యవసాయ చట్టాలపై సుప్రీంకు రైతులు

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై గత కొద్ది రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) శుక్రవారం సర్వోన్నత

Updated : 11 Dec 2020 16:57 IST

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై గత కొద్ది రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. నూతనంగా తీసుకొచ్చిన మూడు చట్టాల వల్ల కార్పొరేట్ల దోపిడీకి రైతులు బలయ్యే ప్రమాదం ఉందని బీకేయూ అధ్యక్షుడు భాను ప్రతాప్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ చట్టాలపై పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన 16వ రోజుకు చేరింది. చట్టాలపై గత బుధవారం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు తిరస్కరించిన రైతు సంఘాలు.. చట్టాలు రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి. అయితే కేంద్రం మాత్రం రద్దుకు అంగీకరించట్లేదు. 

ఉద్యమం ఆపండి: తోమర్‌

మరోవైపు కేంద్రం ప్రతిపాదనలు పరిశీలించాలని గురువారం రైతులను కోరిన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌.. నేడు మరోసారి అన్నదాతలకు అభ్యర్థనలు చేశారు. సామాన్య ప్రజల అవసరాల దృష్ట్యా ఆందోళన ఆపాలని కోరారు. ‘చర్చల తర్వాత చట్టాల్లో సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చట్టాల్లో అభ్యంతరాలుంటే వాటి పరిష్కారం కోసం సూచనలు ఇవ్వాలని రైతులను కోరాం. కానీ అన్నదాతలు అందుకు ఒప్పుకోవట్లేదు. రైతులు ఉద్యమం ఆపి చర్చలకు రావాలి. అన్నదాతలతో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని తోమర్‌ చెప్పుకొచ్చారు. 

రైతుల సహనాన్ని పరీక్షించకండి: పవార్‌

రైతుల ఆందోళనపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు. వ్యవసాయ బిల్లులపై లోతైన చర్చలు చేపట్టాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ ప్రభుత్వం తొందరతొందరగా బిల్లులను పాస్‌ చేసిందని ఆరోపించారు. రైతుల సమస్యలపై కేంద్రం సానుకూల పరిష్కారం ఇవ్వకపోతే ఈ ప్రతిష్టంభన మరిన్ని రోజులు కొనసాగే అవకాశముందన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతు సహనాన్ని పరీక్షించడం మంచిది కాదని.. అలా చేస్తే ఇప్పుడు దిల్లీ సరిహద్దుకు పరిమితమైన ఆందోళనలు దేశమంతా పాకుతాయని శరద్‌ పవార్‌ హెచ్చరించారు. 

ఇవీ చదవండి..

రైతుల ఆందోళన: విధుల్లోని పోలీసులకు కరోనా

100 ప్రెస్‌మీట్‌లు.. 700 సభలు: భాజపా ప్లాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని