
హాథ్రస్ డీఎంను సస్పెండ్ చేయాలి: ప్రియాంక
లఖ్‌నవూ: హాథ్రస్ ఘటనలో జిల్లా మెజిస్ట్రేట్ పూర్తి పాత్రపై విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. అంతేకాకుండా ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ వెంటనే ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను శనివారం కలిసిన తరువాత తాజాగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్ బాధితులతో దురుసుగా ప్రవర్తించిన తీరు గురించి శనివారం వారిని కలిసిన తర్వాత తెలిసింది. జిల్లా మేజిస్ట్రేట్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా పూర్తి ఘటనలో ఆయన పాత్రపై విచారణ చేపట్టాలి. బాధితులు న్యాయ విచారణకు డిమాండు చేస్తే ప్రభుత్వం ఎందుకు సీబీఐ, సిట్ దర్యాప్తును చేపడుతోంది. యూపీ ప్రభుత్వం కాస్త నిద్రమత్తు నుంచి మేల్కొని బాధితుల గోడు వినాలి’ అంటూ ఆమె విమర్శించారు.
హాథ్రస్ అత్యాచార ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకలు శనివారం బాధితుల స్వగ్రామానికి వెళ్లి వారిని పరామర్శించిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో బాధితులకు జరిగిన అన్యాయాన్ని యూపీ సీఎం యోగి అర్థం చేసుకోవాలని ప్రియాంక కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. హాథ్రస్ బాధితుల గొంతును ఈ భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.