26/11 గాయాలను భారత్‌ ఎన్నటికీ మరువదు: మోదీ

ముంబయి పేలుళ్ల గాయాలను యావత్‌ భారత్‌ ఎన్నటికీ మరువదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు.

Updated : 26 Nov 2020 17:00 IST

నూతన విధానాలతో ఉగ్రవాదంపై భారత్‌ పోరు

దిల్లీ: ముంబయి పేలుళ్ల గాయాలను యావత్‌ భారత్‌ ఎన్నటికీ మరువదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సరికొత్త పంథాలో ఉగ్రవాదంపై భారత్‌ పోరు కొనసాగిస్తుందన్నారు. ముంబయి పేలుళ్లు జరిగి 12ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, పౌరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.

‘దేశంలోనే అతిపెద్ద ఉగ్రవాద ఘటన జరిగిన రోజు ఇది. 2018లో పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారు. ఆ ఘటనలో ఎంతో మంది భారతీయులతో పాటు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడిలో మరణించిన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ముఖ్యంగా ముంబయి వంటి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉగ్రవాదాన్ని తిప్పికొడుతున్న మన భద్రతా సిబ్బందికి నమస్కరిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా.. శాసన వ్యవహారాల ప్రిసైడింగ్‌ ఆఫీసర్లతో గుజరాత్‌లో జరిగిన సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో బాంబు పేలుళ్లు జరిగి నేటికి 12 సంవత్సరాలు అయ్యింది. లష్కరే తోయిబా ఉగ్రమూకలు ముంబయి నగరంలో 12 చోట్ల నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 60గంటలపాటు జరిగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముంబయికి చెందిన పోలీసు ఉన్నతాధికారులు కూడా అమరులయ్యారు. వందల సంఖ్యలో సామాన్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బందిని అక్కడే మట్టుబెట్టగా, మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను 2012లో ఉరితీశారు.

ఇవీ చదవండి..
26/11: ఆ మారణహోమానికి 12ఏళ్లు
నవంబర్‌ ..తుపాన్ల మాసం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని