
నిరూపిస్తే రాజీనామా చేస్తా: గులాంనబీ ఆజాద్
30ఏళ్లలో ఏనాడు భాజపాకు అనుకూలంగా మాట్లాడలేదు: కపిల్ సిబల్
దిల్లీ: పార్టీ అధ్యక్ష పదవిపై జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ 23మంది సీనియర్లు సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. సమావేశంలో ఈ లేఖపై చర్చ జరిగింది. లేఖను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ సీనియర్లపై మండిపడ్డారు. ‘భాజపాతో కుమ్మక్కై సోనియాకు లేఖ రాశారా?’ అని ఒక దశలో రాహుల్ గాంధీ సీనియర్లను నిలదీశారు. ఈ వ్యాఖ్యలకు కొందరు సీనియర్లు నొచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్ స్పందించారు. భాజపాతో జతకలిపి సోనియాకు లేఖ రాశామని నిరూపిస్తే తాను పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మరో సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా ట్విటర్‌లో స్పందించారు. గడిచిన 30ఏళ్లలో ఏరోజూ భాజపాకు అనుకూలంగా ఏ విషయంలోనూ మాట్లాడలేదని కపిల్ సిబల్ వివరణ ఇచ్చారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ పక్షానే నిలిచామని, మణిపూర్‌లోనూ భాజపాని గద్దె దించేందుకు పార్టీ పక్షాన పోరాడామని కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. అయినా మేము భాజపాతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యలు చేశారని ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ట్వీట్‌పై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్‌లోనే స్పందించారు. రాహుల్ గాంధీ అటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆయన అటువంటి వ్యాఖ్యలను అనుమతించరని తెలిపారు. మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా అపోహలు వ్యాప్తి చేయవద్దన్నారు. మనం పరస్పరం గొడవపడే కంటే మోదీ పాలనపై పోరాడాలన్నారు. ఆయన ఈ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే కపిల్ సిబల్ తన ట్వీట్ డిలీట్ చేయడం గమనార్హం. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వ్యక్తిగతంగా చెప్పడంతో తాను ఆ ట్వీట్ డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు.