వంతెన రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. పరుగెత్తినా దక్కని ప్రాణం!

Gujarat: నిర్మాణంలో ఉన్న వంతెన మృత్యువులా దూసుకొచ్చింది. దాంతో అది కూలుతున్న విషయాన్ని గమనించినా కూడా ఓ వ్యక్తి నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.

Updated : 24 Oct 2023 14:06 IST

గాంధీనగర్‌: నిర్మాణంలో ఉన్న వంతెన (under construction bridge) కూలడంతో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన కూలడాన్ని గమనించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ కాంక్రీట్‌ స్లాబుల కింద అతడు నలిగిపోయిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌ (Gujarat)లోని పాలన్‌పుర్‌(Palanpur)లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పాలన్‌పుర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనకు ఇటీవలే ఆరు కాంక్రీట్‌ స్లాబులు అమర్చారు. అయితే సోమవారం అవి కూలిపోయాయని అధికారులు తెలిపారు. ఆ ఘటనలో ఓ వ్యక్తి మరణించిన తీరు కలచివేస్తోంది. వంతెన కూలిపోతున్న విషయాన్ని గమనించిన అతడు.. తన ఆటోను వదిలి, ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అతడు ఎంత వేగంగా పరిగెత్తినా.. వంతెన స్లాబులు కూలిపోవడంతో వాటి కింద అతడు నలిగిపోయి, ప్రాణాలు కోల్పోయాడు.

మరో ఇద్దరు వ్యక్తులు కూడా వాటికింద చిక్కుకుపోయినట్లు ఘటనా స్థలంలోని వ్యక్తులు చెప్పారు. ఆటోతో పాటు ట్రాక్టర్ కూడా వాటికింద నుజ్జునుజ్జు కావడంతో వారు కూడా చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఇది పాలన్‌పుర్‌-అంబాజీని అనుసంధానించే రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌ అని, శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది అప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని