Maharashtra: అజిత్ పవార్‌ కొత్త ఆఫీస్‌కు లాక్‌.. తాళం చెవి మిస్సింగ్‌..!

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. ప్రారంభోత్సవానికి కేటాయించిన భవనం తాళం చెవి  కనిపించకుండా పోవడమే అందుకు కారణం. 

Published : 04 Jul 2023 14:24 IST

ముంబయి: ప్రస్తుతం ఎన్‌సీపీ(NCP) పార్టీ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar) అన్న కుమారుడు అజిత్ పవార్‌(Ajit Pawar) పార్టీని చీల్చి.. భాజపా ప్రభుత్వంలో చేరడమే అందుకు కారణం. అయితే.. అజిత్ తన వర్గం కోసం ప్రత్యేక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రారంభోత్సవం వేళ చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందంటే..?

మహారాష్ట్ర సచివాలయం సమీపంలో అజిత్.. తన వర్గానికి చెందిన పార్టీ కార్యాలయం ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో అజిత్ సన్నిహిత నేతలు అక్కడికి చేరుకున్నారు. ఆ భవనం దగ్గరకు వెళ్లి చూడగా.. దానికి తాళం వేసి ఉంది. తాళంచెవి ఎక్కడుందో సమాచారం కూడా లేదు. దాంతో వారు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గరపడుతుండటంతో యువ నేతలు తాళం పగలగొట్టేందుకు యత్నించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ గది తలుపులకు లోపల కూడా తాళం వేసి ఉండటం గమనార్హం.

ఈ భవనం అంబదాస్‌ ధన్వే(Ambadas Danve)ది. ఆయన ఉద్ధవ్‌ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం తాళం చెవి కనిపించకపోవడంతో.. ధన్వే మరో భవవాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్‌సీపీ నేత ఒకరు స్పందించారు. ప్రారంభోత్సవం కోసం తాము అన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కానీ ధన్వే పీఏ ఆ గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయారు. పీఏకు కాల్‌  చేస్తే.. దగ్గర్లో ఉన్నానని వెంటనే వస్తానని చెప్పాడన్నారు. ఇలా జరగడం వెనక కుట్ర ఉందని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. శరద్‌, అజిత్ పక్షాలు తమదే అసలైన ఎన్‌సీపీ అని ప్రకటించుకున్నాయి. అయితే వారి చెంత ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను మాత్రం వెల్లడించడం లేదు. అలాగే తిరుగుబాటు చేసిన నేతలపై శరద్‌ పవార్ కఠిన చర్యలు ప్రారంభించారు. సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సహా పలువురిని తొలగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని