టెకీలతో ట్రాఫికర్‌.. సిగ్నల్‌ జంప్‌ చేస్తే కంపెనీకే సమాచారం!

Techies: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే టెకీలకు ముకుతాడు వేసేందు బెంగళూరు పోలీసులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగి పనిచేసే కంపెనీకి ఆ వివరాలు తెలియజేయనున్నారు.

Published : 16 Dec 2023 18:09 IST

బెంగళూరు: రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు వేయడం సాధారణంగా జరిగేదే. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా మైనర్లు ఎవరైనా పట్టుబడితే వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడమూ అక్కడక్కడా జరిగేదే. కానీ, సిగ్నల్‌ జంప్‌ చేయడం, స్పీడ్‌ లిమిట్‌ను దాటేసి రయ్‌ రయ్‌మంటూ దూసుకెళితే ఇకపై సహించేది లేదంటున్నారు బెంగళూరు పోలీసులు. అంతేకాదు ఈ విషయాన్ని నేరుగా ఉద్యోగి పనిచేసే కంపెనీకే తెలియజేస్తామంటున్నారు. టెకీల దూకుడుకు ముకుతాడు వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

రహదారి భద్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా బెంగళూరు ఈస్ట్ డివిజన్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ కొత్త డ్రైవ్‌ను చేపట్టారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, వైట్ ఫీల్డ్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టనున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ సత్ఫలితాలను ఇస్తే బెంగళూరులోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తామని బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.

18 నుంచి గోల్డ్‌ బాండ్‌ సబ్‌స్క్రిప్షన్‌.. గ్రాము ధరెంత? ఎలా కొనాలి?

ఈస్ట్ బెంగళూరులోనే ఈ డ్రైవ్‌ను చేపట్టడానికి గల కారణాన్నీ పోలీసులు తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఉండే టెకీలు త్వరత్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడం కోసం ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను జంప్‌ చేస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కాబట్టి ఇకపై ఎవరైనా టెకీ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే ఐడీ కార్డు ఆధారంగా సంబంధిత సమాచారాన్ని ఆ కంపెనీకి ఇ-మెయిల్‌, వాట్సప్‌ ద్వారా తెలియజేస్తామని బెంగళూరు ఈస్ట్‌ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ కుల్దీప్‌ కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. టెక్‌ కంపెనీలు సైతం రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని