7 కంపెనీలు ₹3900 కోట్లు.. వచ్చేవారం IPOల క్యూ!

IPO Queue: వచ్చేవారం ఐపీఓలు క్యూ కడుతున్నాయి. ఏడు మెయిన్‌ బోర్డు సహా 11 ఐపీఓలు మార్కెట్లో నిధులు సమీకరించనున్నాయి. ఆ వివరాలు ఇవీ..

Published : 16 Dec 2023 14:57 IST

IPO news | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఐపీఓల (IPO) సీజన్‌ నడుస్తోంది. టాటా టెక్‌, ఫ్లెయిర్‌, గాంధార్‌ ఆయిల్‌ వంటి ఐపీఓలు ఇటీవల కాలంలో సూపర్‌హిట్‌ కొట్టిన వేళ మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం ఏకంగా 11 కంపెనీలు ఐపీఓకు సిద్ధమయ్యాయి. ఇందులో ముత్తూట్‌ మైక్రోఫిన్‌, మోతీసన్స్‌ జువెలర్స్‌, హ్యాపీ ఫోర్జింగ్స్‌ వంటి ఏడు మెయిన్‌బోర్డ్‌ ఐపీఓలు కాగా.. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో మరో నాలుగు కంపెనీలు నిధులు సమీకరించనున్నాయి.

ముత్తూట్‌ మైక్రోఫిన్‌

ముత్తూట్‌ పప్పాచాన్‌ గ్రూప్‌నకు చెందిన మైక్రో రుణ సంస్థ ముత్తూట్‌ మైక్రోఫిన్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ డిసెంబర్‌ 18న ప్రారంభమై 20న ముగియనుంది. రూ.960 కోట్లు నిధులు సమీకరించేందుకు ఐపీఓకు వస్తున్న ఈ సంస్థ ఒక్కో షేర్ల ధరల శ్రేణిని రూ.277-291గా నిర్ణయించింది. ఇందులో రూ.760 కోట్లను ప్రైమరీ షేర్ల విక్రయం ద్వారా.. మిగిలిన రూ.200 కోట్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించనున్నారు. ఐపీఓలో విక్రయిస్తున్న షేర్లను క్యూఐబీలకు 55 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం చొప్పున కేటాయించారు. రిటైల్‌ మదుపరులు కనీసం 51 షేర్లకు (1 లాట్‌) బిడ్లు దాఖలు చేయాలి. కనీసం రూ.14,841 చొప్పున పెట్టుబడి పెట్టాలి.

హ్యాపీ ఫోర్జింగ్స్

ఆటోమొబైల్‌ రంగంలో విడిభాగాల తయారు చేసే హ్యాపీ ఫోర్జింగ్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ డిసెంబర్‌ 19న ప్రారంభమై 21న ముగియనుంది. రూ.1008 కోట్లు సమీకరించే ఉద్దేశంతో ఐపీఓకు వస్తున్న ఈ కంపెనీ ఒక్కోషేరు ధరల శ్రేణిని రూ.808-850గా నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్లు విలువైన షేర్లను ఫ్రెష్‌గా ఇష్యూ చేయనున్నారు. 71.6 లక్షల షేర్లు ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నారు. క్యూఐబీలకు 50 శాతం షేర్లు కేటాయించారు. 35 శాతం షేర్లు రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం ఎన్‌ఐఐకు కేటాయించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 17 ఈక్విటీ షేర్లు (లాట్‌) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

18 నుంచి గోల్డ్‌ బాండ్‌ సబ్‌స్క్రిప్షన్‌.. గ్రాము ధరెంత? ఎలా కొనాలి?

ముఫ్తీ జీన్స్ ఐపీఓ

ముఫ్తీ జీన్స్‌ తయారీ సంస్థ క్రెడో బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ లిమిటెడ్‌ ఐపీఓ డిసెంబర్‌ 19న ప్రారంభమై 21న ముగియనుంది. రూ.550 కోట్ల ఐపీఓలో భాగంగా ధరల శ్రేణిని రూ.266-280గా కంపెనీ నిర్ణయించింది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించనున్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు (లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌

ముంబయికి చెందినన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఐపీఓ డిసెంబర్‌ 18న ప్రారంభమై 20న ముగియనుంది. రూ.400 కోట్ల ఈ ఐపీఓలో ఫ్రెష్‌ షేర్లను జారీ చేయనున్నారు. ధరల శ్రేణి రూ.340-360గా నిర్ణయించారు.

మోతీసన్స్ ఐపీఓ

జైపుర్‌కు చెందిన రిటైల్‌ ఆభరణాల కంపెనీ మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓ డిసెంబర్‌ 18న ప్రారంభమై 20న ముగియనుంది. ఐపీఓలో షేరు ధరల శ్రేణిని రూ.52-55గా నిర్ణయించారు.  2.74 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.151 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లు కనీసం 250 ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన కనీసం రూ.13,750 పెట్టుబడిగా పెట్టాలి.

ఆర్‌బీజడ్‌ జువెలర్స్‌

రూ.100 కోట్ల నిధులు సమీకరించేందుకు ఐపీఓకు వస్తున్న ఆర్‌బీజడ్‌ డిసెంబర్‌ 19న ప్రారంభమై 21న ముగియనుంది. ధరల శ్రేని 90-100గా నిర్ణయించారు. ఫ్రెష్‌ షేర్లను జారీ చేయనున్నారు.

ఆజాద్‌ ఇంజినీరింగ్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ విడిభాగాల తయారీ సంస్థ అజాద్‌ ఇంజినీరింగ్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ డిసెంబర్‌ 20న ప్రారంభమై 22 ముగియనుంది. రూ.740 కోట్ల ఐపీఓలో రూ.500 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌, రూ.240 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్‌గా జారీ చేయనున్నారు.

ఇవి కాకుండా ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో సహారా మారిటైమ్‌ ఐపీఓ డిసెంబర్‌ 18న ప్రారంభం కానుంది. రూ.7 కోట్లు సమీకరించనుంది. రూ.80 కోట్లతో ఎలక్ట్రోఫోర్స్‌, రూ.31.25 కోట్లు సమీకరించేందుకు శాంతి స్పిన్‌టెక్స్‌ సంస్థలు డిసెంబర్‌ 19న ఐపీఓకు వస్తున్నాయి. డిసెంబర్‌ 21న ట్రిడెంట్‌ టెక్‌ల్యాబ్స్‌ ఐపీఓ ద్వారా రూ.16 కోట్లు సమీకరించనుంది. వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు 65 సంస్థలు ఐపీఓకు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో కొన్నింటికి సెబీ అనుమతులు లభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని