CoWIN Data Leak: కొవిన్‌ డేటా లీక్‌ వ్యవహారం.. బిహార్‌ వ్యక్తి అరెస్ట్‌

కొవిన్‌ పోర్టల్‌లోని (CoWIN portal) సున్నితమైన సమాచారం లీకైందంటూ ఇటీవల వచ్చిన వార్తలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 22 Jun 2023 15:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్‌ పోర్టల్‌లోని (CoWIN portal) సున్నితమైన సమాచారం లీకైందని ఇటీవల వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వీటిని తిప్పికొట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా తాజాగా బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం ఇతడిని అదుపులోకి తీసుకుంది. ప్రముఖులు, ఉన్నతాధికారులకు సంబంధించిన సమాచారాన్ని ఈ వ్యక్తే సోషల్‌ మీడియాలో లీక్‌ చేసినట్లు (Data Leak) అనుమానిస్తున్నారు. ఆరోగ్యకార్యకర్తగా ఉన్న అతడి తల్లి నుంచి ఈ వివరాలు సంపాదించినట్లు భావిస్తున్నారు. దీంతో ఆమెను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌ (CoWIN) పేరిట ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ వివరాలు నమోదు చేసి పౌరులు టీకా తీసుకొంటున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్‌ వివరాలు, ఫోన్‌ నంబర్‌తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్‌ తీసుకొన్నారు? వంటి సమాచారం ఉంటుంది. అయితే, ఇలాంటి కీలక సమాచారం మెసెంజర్‌ యాప్‌ టెలిగ్రామ్‌లో (Telegram) ఇటీవల వెలుగు చూడటం కలకలం రేపింది. ఇలా ప్రముఖుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఆధార్‌, పాన్‌ తదితర వివరాలు ప్రత్యక్షం కావడంపై స్పందించిన కేంద్రం.. డేటా లీక్‌ వార్తలను తిప్పికొట్టింది.

ఓటీపీ (OTP)తో మాత్రమే పోర్టల్‌లోని డేటాను చూడగలమని.. దాన్నుంచి డేటా లీకయ్యే అవకాశమే లేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఓటీపీ లేకుండా పోర్టల్‌ (Co-WIN portal)లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్‌ చేయలేమని తెలిపింది. ఈ డేటా లీక్‌ వ్యవహారంపై దిల్లీ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం(సీఈఆర్‌టీ)తో కలిసి ఈ బాట్‌తోపాటు దాన్ని క్రియేట్‌ చేసిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బిహార్‌కు చెందిన యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని