బెంగాల్‌లో మణిపుర్‌ తరహా ఘటన.. వివస్త్రను చేసి ఇద్దరు మహిళలపై దాడి!

పశ్చిమ బెంగాల్‌లో మణిపుర్‌ తరహా ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి కొడుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. దీనిపై భాజపా విమర్శలు గుప్పించగా.. తృణమూల్‌ తిప్పికొట్టింది.

Updated : 22 Jul 2023 20:38 IST

కోల్‌కతా: మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన (Manipur) దేశం మొత్తాన్ని కదిలించింది. ఇప్పుడు అదే తరహా ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి చెప్పులతో కొడుతున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను భాజపా (BJP) ఐటీ సెల్‌ ఇన్‌ఛార్జి అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ ఆరోపణలను అధికార తృణమూల్‌ (TMC) ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రజల దృష్టి మరల్చేందుకే భాజపా కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించింది.

‘‘పశ్చిమ బెంగాల్‌లో హింసా కొనసాగుతోంది. మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలుగా చేసి దారుణంగా హింసించారు. అక్కడే ఉన్న పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప కనీసం అడ్డుకోలేదు. జులై 19న ఈ ఘటన జరిగింది’’ అంటూ అమిత్‌ మాలవీయ ట్వీట్ చేశారు. ఈ ఘటన తన రాష్ట్రంలో జరిగింది కాబట్టే మమతా బెనర్జీ స్పందించలేదని విమర్శించారు. 
అమిత్‌ మాలవీయ ఆరోపణలను ఆ రాష్ట్ర మంత్రి శశి పంజా ఖండించారు. మార్కెట్లో దొంగతనం చేశారన్న ఆరోపణలపై ఇద్దరు మహిళలపై స్థానికులు దాడి చేశారని చెప్పారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. భాజపా కావాలనే ఈ ఘటనపై రాజకీయం చేయాలనుకుంటోందని విమర్శించారు.

బియ్యం ఎగుమతులపై నిషేధం.. అమెరికాలో ఎన్నారైల తిప్పలు

ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. మాల్దాలోని బమన్‌గోలా మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. దొంగతనం చేశారన్న కారణంతో వారిపై ఈ దాడి జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని, త్వరలో అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ ఘటనను కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌధరి తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన భాజపా అభ్యర్థినిని సైతం మణిపుర్‌ తరహాలో దుస్తులు విప్పి ఊరేగించారంటూ భాజపా ఎంపీ లాకెట్‌ ఛటర్జీ శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ మరుసటి రోజే బెంగాల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని