Black Fungus: 28 రాష్ట్రాల్లో 28వేల కేసులు!

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 28వేల మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Updated : 07 Jun 2021 19:46 IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడి

దిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 28వేల మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 86శాతం మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతపై వర్చువల్‌ పద్ధతిలో ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.

దేశంలో ఇప్పటివరకు నమోదైన మ్యుకర్‌మైకోసిస్‌ కేసుల్లో 86శాతం (24,370కేసులు) కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారివేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో 62.5శాతం (17,601) కేసులకు సంబంధించి మధుమేహులు ఉన్నారని వెల్లడించారు. మ్యుకర్‌మైకోసిస్‌ కేసులు మహారాష్ట్రలో అత్యధికంగా 6339 కేసులు నమోదుకాగా, గుజరాత్‌లో 5486 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇక సెకండ్‌ వేవ్‌ సమయంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోందని, కోలుకుంటున్న వారిసంఖ్య పెరుగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 83శాతం క్రియాశీల కేసులు 10రాష్ట్రాల్లో ఉండగా, మరో 17శాతం కేసులు 26రాష్ట్రాల్లో ఉన్నట్లు వెల్లడించారు.

6.34శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు

‘దేశంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా.. గడిచిన రెండు నెలల్లో కనిష్ఠ కేసులు ప్రస్తుతం నమోదవుతున్నాయి. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్తంగా 2624 కేంద్రాల్లో వీటిని చేపడుతున్నాం. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 6.34శాతానికి తగ్గింది. గడిచిన పది రోజులుగా పాజిటివిటీ రేటు 10శాతానికి తక్కువగానే ఉంటోంది’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలో కరోనా వైరస్‌ మార్పులకు సంబంధించిన జన్యుక్రమాన్ని విశ్లేషించే ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు 30వేల శాంపిళ్లను పరీక్షించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యుకర్‌మైకోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసులను గుర్తించబడిన వ్యాధిగా ప్రకటించాలని మే 20న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ వీటిని ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని