Amit Shah: అవన్నీ యూపీఏ హయాంలోని కేసులే.. సీబీఐ, ఈడీ దాడులపై అమిత్ షా

దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయని అన్నారు అమిత్ షా. సీబీఐ, ఈడీ విచారిస్తున్న కేసులన్నీ యూపీఏ హయాంలోనే నమోదైనవేనంటూ ప్రతిపక్షాలకు ఘాటుగా సమాధానమిచ్చారు.

Published : 18 Mar 2023 14:23 IST

దిల్లీ: సీబీఐ (CBI), ఈడీ (ED) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) గట్టి సమాధానం ఇచ్చారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తోన్న కేసుల్లో రెండు మినహా మిగతావన్నీ యూపీఏ (UPA) హయాంలో నమోదైనవేనని అన్నారు. ఆ సంస్థలు పాదర్శకంగా పనిచేస్తున్నాయని అన్న కేంద్ర మంత్రి.. ఆ దర్యాప్తుల్లో తప్పుందనిపిస్తే కోర్టుకెళ్లొచ్చని తెలిపారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ (Congress)కు చెందిన ఓ బడా నాయకురాలు మాట్లాడుతూ.. ‘అవినీతి పాల్పడితే ఎందుకు విచారించట్లేదు’ అని మమ్మల్ని ప్రశ్నించారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఆ పని చేస్తుంటే మేం కుట్ర చేస్తున్నామని ఆరోపిస్తున్నారు. ఈ దర్యాప్తు సంస్థలు కోర్టులకు అతీతమేమీ కాదు. నోటీసులు, ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జ్‌షీట్లపై వారు న్యాయస్థానాల్లో సవాల్‌ చేయొచ్చు. వారు కోర్టులకు వెళ్లకుండా బయట ఎందుకు అరుస్తున్నారు..? కోర్టులకు వెళ్లకుండా వారిని ఎవరు అడ్డుకుంటున్నారు? మా కంటే వారి పార్టీలోనే (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) మంచి లాయర్లున్నారు. అయినా ఓ వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు చేపట్టకూడదా? ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న కేసుల్లో రెండు మినహా మిగతావన్నీ వారి ప్రభుత్వంలో(యూపీఏ హయాం) నమోదైనవే’’ అని అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.

10 ఏళ్ల యూపీఏ (UPA) పాలనలో రూ.12లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు చోటుచేసుకున్నాయని అమిత్ షా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. అప్పుడు పరిస్థితులను సద్దుమణిగించేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం సీబీఐతో కేసులు నమోదు చేసిందని గుర్తుచేశారు. అందులో ఏమైనా మనీలాండరింగ్‌ ఆరోపణలు వస్తే.. ఈడీ తప్పకుండా దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ‘‘దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చట్టాలను పాటించాల్సిందే. అదొక్కటే మనకున్న మార్గం’’ అని అమిత్ షా తెలిపారు.

‘అదానీ’ వ్యవహారంపై స్పందించిన షా..

ఈ సందర్భంగా అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపైనా అమిత్ షా (Amit Shah) స్పందించారు. ‘‘ఆ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై ఎవరి దగ్గరైనా సాక్ష్యాలుంటే ఆ కమిటీకి సమర్పించొచ్చు. తప్పు జరిగిందని తేలితే ఎవర్నీ వదిలిపెట్టబోం. న్యాయపరమైన ప్రక్రియపై అందరూ విశ్వాసం ఉంచాలి. అయితే, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. అటు సెబీ కూడా దీనిపై దర్యాప్తు చేస్తోంది’’ అని అమిత్ షా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని