Chandigarh: ‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే..’ చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై ‘సుప్రీం’ దిగ్భ్రాంతి

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక సమయంలో ప్రిసైడింగ్‌ అధికారి బ్యాలెట్‌ పత్రాలను పాడుచేసినట్లు ప్రాథమికంగా వెల్లడవుతోందని సుప్రీం కోర్టు తెలిపింది.

Updated : 05 Feb 2024 18:32 IST

దిల్లీ: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక (Chandigarh Mayor Election) నిర్వహణ తీరుపై సుప్రీం కోర్టు (Supreme Court) దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఎన్నిక ప్రక్రియ వీడియోను వీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం.. రిటర్నింగ్‌ అధికారి బ్యాలెట్‌ పత్రాలను పాడుచేసినట్లు ప్రాథమికంగా వెల్లడవుతోందని తెలిపింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, దాన్ని ఖూనీ చేయడాన్ని అనుమతించబోమని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. బ్యాలెట్‌ పత్రాలు, వీడియో, ఇతర సామగ్రి సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని పంజాబ్- హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.

మేయర్ ఎన్నికలో అక్రమాలు జరిగాయని.. దాన్ని రద్దు చేసి, మళ్లీ పోలింగ్‌ జరిపించాలని కోరుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) తరఫు కౌన్సిలర్‌ తొలుత పంజాబ్- హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు చేరారు. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణ చేపట్టేవరకు చండీగఢ్‌ కార్పొరేషన్‌ సమావేశాన్ని వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై చండీగఢ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల అధికారి ‘పెన్ను’పోటు?

జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో తగినంత సంఖ్యా బలం(16) లేకపోయినా భాజపా మేయర్‌ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ అనూహ్య విజయం సాధించారు. మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం(20) ఉన్నప్పటికీ ఆప్‌- కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఎన్నికల అధికారి బ్యాలెట్‌ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి.. వాటిలో కొన్నింటిని చెల్లకుండా చేశారని కాంగ్రెస్‌, ఆప్‌లు ఆరోపించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని