చైనాలో మరోసారి విస్తరిస్తోన్న కరోనా కేసులు!

చైనాలో కరోనా వైరస్‌ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా హెబీ సహా మరికొన్ని ప్రావిన్సుల్లో పెరుగుతున్న కేసుల కారణంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ డ్రాగన్‌ దేశం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశరాజధాని బీజింగ్‌కు దక్షిణాన ఉన్న గ్వాన్‌ నగరంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated : 12 Jan 2021 12:37 IST

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా హెబీ సహా మరికొన్ని ప్రావిన్సుల్లో పెరుగుతున్న కేసుల కారణంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ డ్రాగన్‌ దేశం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశరాజధాని బీజింగ్‌కు దక్షిణాన ఉన్న గ్వాన్‌ నగరంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు ఐదు నెలల తర్వాత సోమవారం నాడు అత్యధికంగా 103 కేసులు నమోదు కాగా.. మంగళవారం చైనావ్యాప్తంగా 55కి పైగా కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. తాజా కేసుల్లో 40 కేసులు ఒక్క హెబీ ప్రావిన్స్‌లోనే నమోదైనట్లు ప్రావిన్షియల్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరోసారి పరిస్థితి చేజారి పోకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ భారీ స్థాయిలో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. బీజింగ్‌లోనూ ఒక కరోనా కేసు నిర్ధారణ కావడంతో సంబంధిత ప్రాంతాన్ని లాక్‌డౌన్‌లో ఉంచారు. అంతేకాకుండా ప్రజలను అనవసర ప్రయాణాలు మానుకోమని సూచిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

చైనాలో గతేడాది కరోనా వైరస్‌ బయటపడిన సమయంలో వుహాన్‌లో తొలిసారిగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనాలో మొత్తం 87,591 కేసులు నమోదు కాగా.. 4,634 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా పుట్టుకపై విచారణ జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం గతవారం చైనాకు చేరుకుంది. కొవిడ్‌ మొదట మనుషులకు ఎలా సోకిందనే విషయంపై నిపుణులు దృష్టి సారించనున్నారని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌ ఇప్పటికే వెల్లడించారు. 

పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు వాయిదా
కరోనా కారణంగా చైనాలో గతేడాది మార్చిలో భారీ స్థాయిలో జరగాల్సిన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశాల్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశాలు ఇప్పుడు ఫిబ్రవరి నెలలో హెబీ ప్రావిన్స్‌లో జరగాల్సి ఉండగా.. మరోసారి వాటిని వాయిదా వేస్తూ ప్రావిన్షియల్‌ అధికారులు నిర్ణయించారు. కానీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని వెల్లడించలేదు.  

ఇదీ చదవండి

అమెరికా రాజధానిలో ఎమర్జెన్సీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని