Modi: ‘అవినీతి.. వారసత్వం’.. దేశాన్ని పట్టిపీడిస్తోన్న చెదపురుగులు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. అవినీతి, వారసత్వం అనే రెండు చెదపురుగులు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ పీడను తొలగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి

Updated : 15 Aug 2022 10:58 IST

దిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. అవినీతి, వారసత్వం అనే రెండు చెదపురుగులు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ పీడను తొలగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందన్నారు. ఈ చెదపురుగులను జనజీవనం నుంచి తరిమేద్దామని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు.

అవినీతిపరులను క్షమిస్తే.. అభివృద్ధికి ఆటంకమే

‘‘అవినీతి మన దేశాన్ని చెదపురుగులా తినేస్తోంది. కొందరికి బతకడానికే నీడ లేదంటే.. మరికొందరికి మాత్రం డబ్బు దాచిపెట్టుకోడానికి చోటు సరిపోవట్లేదు. ఈ అంతరాన్ని తొలగించి అవినీతిని నిర్మూలిస్తేనే సామాన్యుడి జీవితం మెరుగవుతుంది. దేశవ్యాప్తంగా అవినీతిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ కొందరు అవినీతిపరులపై క్షమ చూపించాలని భావిస్తున్నారు. అవినీతిపరులను క్షమిస్తే అభివృద్ధికి ఆటంకం. అవినీతి, అవినీతిపరుల విషయంలో జాగృతం కావాలి. అవినీతిపరులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిందే.’’

వారసత్వం.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

‘‘వారసత్వంపై మాట్లాడితే రాజకీయ భావనగా విమర్శిస్తారు. కానీ ఇది కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. అనేక రంగాలకు వ్యాపించింది. కుటుంబ పాలన వల్ల చాలా సంస్థలు ప్రభావితమవుతున్నాయి. కొత్త నైపుణ్యాలు బయటకు రావట్లేదు. ప్రజాస్వామ్యానికి వారసత్వం విఘాతం కలిగిస్తోంది. కొత్త నాయకత్వానికి అవకాశాలు లేకుండా చేస్తోంది. దీని వల్ల సమర్థ నాయకులు రాలేకపోతున్నానరు. వారసత్వాన్ని ఆదరించడం అంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదే. మన దేశాన్ని, సంస్థలను కాపాడుకోవాలంటే దీన్ని ఎన్నటికీ సహించకూడదు. వారసత్వ వ్యతిరేక ఉద్యమంలో అందరి సహకారం కావాలి. ఇది ప్రజాఉద్యమం కావలి. వారసత్వ నిర్మూలనకు మనమందరం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢమిల్లుతుంది.’’

అవే మన ‘పంచప్రాణాలు’..

‘‘వచ్చే 25 ఏళ్లల్లో మనకు స్వాతంత్ర్యం లభించి 100 ఏళ్లు పూర్తికానుంది. ఈ అమృతకాలంలో ‘పంచప్రాణాల’ సంకల్పం చేసుకుని అభివృద్ధి కోసం పోరాడాలి. వికసిత భారతం, బానిసత్వ నిర్మూలన, వారసత్వాన్ని పరిరక్షించడం, ఏకత్వం, పౌర బాధ్యత.. ఈ ఐదు మన పంచ ప్రాణాలు. వచ్చే పాతికేళ్లలో వీటిపై మనం దృష్టిపెట్టాలి. ఈ 25 ఏళ్లలో సమరయోధుల ఆకాంక్షలు సాకారం చేయాలి’’

టెలీప్రాంప్టర్‌ను వదిలి..

స్వాత్రంత్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది తొమ్మిదోసారి. 75ఏళ్ల వజ్రోత్సవాల సందర్భంగా మోదీ మువ్వన్నెల రంగులతో ఉన్న తలపాగాను ధరించి కన్పించారు. గతంలో మాదిరిగా టెలీ ప్రాంప్టర్‌లో కాకుండా.. ఈ సారి ప్రసంగ పత్రాలను తెచ్చుకుని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనే ముందు ప్రధాని రాజ్‌ఘట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు