Supreme Court: న్యాయస్థానమంటే ప్రచార వేదిక కాదు.. సుప్రీంకోర్టు ఆగ్రహం

పబ్లిసిటీ కోసం కొందరు కోర్టును ఆశ్రయిస్తుండడంపై భారత అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.

Published : 30 Sep 2022 21:33 IST

దిల్లీ: పబ్లిసిటీ కోసం కొందరు కోర్టును ఆశ్రయిస్తుండటంపై భారత అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం కాకుండా కొన్ని కంపెనీలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (EVM)లను నియంత్రిస్తున్నాయని ఆరోపిస్తూ ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. న్యాయస్థానమంటే ప్రచార వేదిక కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. సదరు పార్టీకి రూ.50వేలు జరిమానా విధించింది.

‘దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఈవీఎంల వినియోగం కొనసాగుతోంది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తుతూనే ఉన్నారు. ఇది ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగకుండా అడ్డుకునే ప్రయత్నమే. ఆ పార్టీకి ఓటర్లలో తగినంత గుర్తింపు లభించలేదని తెలుస్తోంది. అందుకే పిటిషన్లు దాఖలు చేస్తూ గుర్తింపు పొందాలని చూస్తోంది’ అంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇటువంటి పిటిషన్లను ప్రోత్సహించేది లేదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పిటిషన్‌దారుకు జరిమానా విధిస్తున్నామని పేర్కొంది.

ఈవీఎంలలో సమస్యలున్నాయని పేర్కొంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన జన్‌ వికాస్‌ పార్టీ గత ఏడాది డిసెంబర్‌లో అక్కడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సుప్రీం కోర్టులో జన్‌వికాస్‌ పార్టీ తాజాగా పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని