Covid 19: పెరుగుతోన్న కొవిడ్‌ కేసులు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 కేసులు పెరుగుతోన్న దృష్ట్యా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది.

Published : 18 Dec 2023 19:08 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 కేసులు పెరగడం, కేరళలో కొత్త సబ్‌ వేరియంట్‌ వెలుగు చూసిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ తాజా అడ్వైజరీ జారీ చేసింది. రానున్న పండగల సీజన్‌లో వైరస్‌ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది.

కరోనా వైరస్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు ఇటీవల కేరళలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ.. భారత్‌ సహా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను హెచ్చరించింది. అప్రమత్తంగా ఉంటూ, కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశించింది.

ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తాజా అడ్వైజరీలో కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సంసిద్ధతలను పరీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ చేపడుతోన్న మాక్‌ డ్రిల్స్‌లో భాగస్వామ్యం కావాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని