Covid: భారత్‌లో ఎండెమిక్‌ దశకు కొవిడ్‌.. మరో 10 రోజుల్లో కేసులు తగ్గుముఖం..!

దేశంలో కరోనా మహమ్మరి ఎండెమిక్‌ దశలోకి ప్రవేశిచిందని వైద్యారోగ్య వర్గాలు వెల్లడించాయి. మరో 10-12 రోజుల తర్వాత నుంచి కేసులు తగ్గుముఖం పడతాయని చెప్పడం ఊరటనిస్తోంది.

Published : 12 Apr 2023 18:15 IST

దిల్లీ: గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా వైరస్‌ (Corona Virus) మళ్లీ విస్తరిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ వైరస్‌ ఉద్ధృతి తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, మన దేశంలో కొవిడ్‌ (Covid).. ఎండెమిక్‌ దశ (endemic stage)కు చేరుకుందని వైద్య వర్గాలు తాజాగా వెల్లడించడం ఊరట కలిగిస్తోంది. అంతేగాక, మరో రెండు వారాల్లో ఈ కేసులు తగ్గుముఖం పడతాయని సదరు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుత వైరస్ వ్యాప్తికి ఒమిక్రాన్‌ (Omicron) ఉపరకమైన XBB.1.16 వేరియంట్‌ కారణమని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఒమిక్రాన్, దాని ఉపరకాల కారణంగా కేసుల పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ.. వైరస్‌ (Corona Virus) తీవ్రత తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక, ఆసుపత్రిలో చేరికలు, మరణాలు పెరుగుతున్నట్లు ఆధారాల్లేవని తెలిపాయి. తాజా వ్యాప్తిలో ఆసుపత్రిలో చేరికలు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి. ‘‘మన దేశంలో కొవిడ్‌ ఎండెమిక్‌ దశ (endemic stage)లోకి ప్రవేశిస్తోంది. అందువల్ల, వచ్చే 10-12 రోజులు కొత్త కేసులు పెరుగుతాయి. ఆ తర్వాత నుంచి వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టి కేసులు తగ్గుతాయి’’ అని వైద్య వర్గాలు వెల్లడించాయి.

గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7,830 కేసులు నమోదవ్వగా.. రోజువారీ పాజిటివిటీ 3.65 శాతంగా ఉంది. అటు క్రియాశీల కేసుల సంఖ్య 40వేలకు చేరింది.

ఎండెమిక్‌ దశ అంటే ఏంటీ..?

పాండమిక్‌(మహమ్మారి)గా ప్రకటించిన వ్యాధి.. వ్యాప్తి చెందుతూ.. ఆ తర్వాత ఉద్ధృతి తగ్గి కాలానుగుణంగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంటుంది. అలాంటి వాటిని ఎండెమిక్‌ (endemic stage) వ్యాధులుగా పిలుస్తారు. అంటే, వైరస్‌ వ్యాప్తిలో ఉన్నప్పటికీ.. దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. డెంగీ, మలేరియా, చికెన్‌గన్యా, సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజా లాంటి వ్యాధులు ఎండెమిక్‌ వ్యాధుల జాబితాలోకి వస్తాయి. ప్రస్తుతం ఇదే జాబితాలో కరోనా కూడా చేరిందని నిపుణుల అభిప్రాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని