కొవిన్‌లో కొత్త సదుపాయం.. కస్టమర్‌ వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ తెలుసుకునే వీలు

CoWIN new API: కరోనా వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్‌ పోర్టల్‌ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Published : 11 Sep 2021 07:14 IST

దిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్‌ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సిన్‌ వేసుకున్నాడా లేదా అనే విషయాన్ని ఒక సంస్థ తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ-వీఎస్‌ (నో యువర్‌ కస్టమర్‌/ క్లయింట్‌ వ్యాక్సినేషన్‌ స్టేటస్‌) సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి, ప్రయాణానికి అనుమతివ్వడానికి, హోటల్‌ గదులు ఇవ్వడానికి ముందు ఆయా సంస్థలకు అవతలి వ్యక్తి స్టేటస్‌ తెలుసుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది. దీనికి సంబంధించి కొత్త ఏపీఐ (API-Application Programming Interface)ని కొవిన్‌ అభివృద్ధి చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72 కోట్ల మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు. వ్యక్తులెవరైనా తమ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ సొంతంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. వాటిని ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. అయితే, మాల్స్‌,  పని ప్రదేశాలు వంటి చోట్ల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ చూపించకుండా కేవలం మొబైల్‌ నంబర్‌, ఓటీపీ ఎంటర్‌ చేయడం ద్వారా సదరు వ్యక్తి వ్యాక్సిన్‌ వేసుకున్నాడా/ ఒక డోసు మాత్రమే వేసుకున్నాడా/ రెండు డోసులూ వేసుకున్నాడా అనేది తెలుసుకోవచ్చు.

పని ప్రదేశాల్లో సదరు సంస్థ తమ ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ స్థితి తెలుసుకునేందుకు, రైల్వేలు, విమానయాన సంస్థలు తమ ప్రయాణికుల వ్యాక్సిన్‌ వివరాలు తెలుసుకునేందుకు కేవైసీ-వీసీ ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే హోటళ్లు.. గదులను కస్టమర్లకు ఇచ్చే ముందు వారి వ్యాక్సినేషన్‌ స్థితి తెలుసుకునేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది. ఉదాహరణకు రైల్వే టికెట్‌ బుక్‌ చేయాలనుకున్నప్పుడు.. ప్రయాణికుడి వ్యాక్సినేషన్‌ స్థితి రైల్వే శాఖ తెలుసుకోవాలంటే ఏపీఐని తన సిస్టమ్‌లో ఇంటిగ్రేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్‌ బుకింగ్‌ సమయంలో మొబైల్‌ నంబర్‌, ఓటీపీ ఎంటర్‌ చేయడం ద్వారా వ్యాక్సిన్‌ వివరాలు రైల్వే శాఖకు అందుతాయి. ఇది వ్యక్తి సమ్మతి ఆధారంగా జరుగుతుంది కాబట్టి.. పౌరుల డేటాకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని కేంద్రం చెబుతోంది. దీని ద్వారా త్వరితగతిన టీకా సమాచారం పొందే వీలుంటుందని పేర్కొంది. ఇందుకోసం కొవిన్‌ టీమ్‌ సిద్ధం చేసిన ఏపీఐని సులువుగా ఏ సిస్టమ్‌లోనైనా పబ్లిక్‌, ప్రైవేట్‌ సంస్థలు ఇంటిగ్రేట్‌ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని