Delta Variant: చైనాలో మళ్లీ పడగ విప్పిన ‘డెల్టా’! 

చైనాను కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. ప్రమాదకర డెల్టా వేరియంట్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు......

Published : 15 Sep 2021 01:57 IST

బీజింగ్‌: చైనాను కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. ప్రమాదకర డెల్టా వేరియంట్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో ఒక్కరోజులోనే డెల్టా కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవడంతో డ్రాగన్‌ అప్రమత్తమైంది. ఆ ప్రావిన్స్‌లో కట్టుదిట్టమైన ఆంక్షలతో పాటు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఫుజియాన్‌లో ఆదివారం 22 కేసులు రాగా.. సోమవారం మరో 59 కొత్త కేసులు వచ్చినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. 24గంటల వ్యవధిలోనే కేసులు రెట్టింపు సంఖ్యలో రావడంతో ఈ కేసుల సంఖ్య 102కి చేరిందని తెలిపారు.

ఇక, పోర్టు సిటీ జియామిన్‌ నగరంలో గడిచిన రెండు రోజుల వ్యవధిలో 33 కేసులు వెలుగుచూడగా.. పుటియాన్‌లో మరో 59 కేసులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వైరస్‌ వ్యాప్తికి అధిక అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు, బార్లను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  హుజియాన్‌ ప్రావిన్స్‌లోని జియామిన్‌ నగరం టూరిజం కేంద్రంగా ఉండగా.. అక్కడ డెల్టా కేసులు బయట పడటంతో 60శాతం విమానాలు రద్దు చేసినట్టు ఆ విమానాశ్రయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా బాధితులను కలిసిన వారిని గుర్తించడంపై దృష్టిపెట్టారు. 

కాన్‌బెర్రాలో అక్టోబర్‌ 15వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో కరోనా కేసులు పెరగడంతో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు. కొత్తగా మరో 22 కేసులు రావడంతో ప్రాదేశిక ముఖ్యమంత్రి ఆండ్రూ బార్‌ కాన్‌బెర్రాలో లాక్‌డౌన్‌ను అక్టోబర్‌ 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని