UttarPradesh: ‘‘అయ్యో దేవుడా.. మా పిల్లలను కాపాడుకునేదెలా..!’’

‘‘చావు బతుకుల్లో ఉన్న పద్నాలుగేళ్ల చెల్లి కోసం అధికారి కారు ముందు మోకరిల్లి ఓ సోదరి ఆవేదన.. కన్నబిడ్డను కాపాడుకునేందుకు చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రికి

Published : 14 Sep 2021 14:51 IST

యూపీలోని ఫిరోజాబాద్‌ చిన్నారులపై డెంగీ పడగ 

లఖ్‌నవూ: ‘‘చావు బతుకుల్లో ఉన్న పద్నాలుగేళ్ల చెల్లి కోసం అధికారి కారు ముందు మోకరిల్లి ఓ సోదరి ఆవేదన.. కన్నబిడ్డను కాపాడుకునేందుకు చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రికి పరిగెడుతోన్న ఓ తండ్రి.. కళ్లెదుటే మనవరాలి మరణంతో ఓ బామ్మ రోదన..’’ ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఎటు చూసినా ఈ దయనీయ దృశ్యాలే. ఈ జిల్లాలో గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంది.

నిన్నటికి నిన్న ఫిరోజాబాద్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో 11ఏళ్ల బాలిక డెంగీతో మరణించడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలికను ఆసుపత్రిలో చేర్చిన సమయంలో ఆగ్రా డివిజనల్‌ కమిషనర్‌ అమిత్ గుప్తా తనిఖీల నిమిత్తం అక్కడకు రాగా.. బాలిక సోదరి ఆయన కారుకు అడ్డుపడింది. ‘‘ప్లీజ్‌ సర్‌. ఏదైనా చేయండి. నా చెల్లికి చికిత్స అందించండి. లేదంటే తను చచ్చిపోతుంది సర్‌’’ అంటూ ఆ బాలిక సోదరి అధికారి కారు ముందు పడి రోదించింది. అయితే కొన్ని గంటలకే ఆ బాలిక కన్నుమూసింది. 

మరికాసేపటికి ఓ తండ్రి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన ఆరేళ్ల కుమార్తెను చేతులపై ఎత్తుకుని పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. దీంతో ఆ తండ్రి విలవిలా ఏడ్చారు. ఈ దృశ్యాలు అక్కడి వారిని తీవ్రంగా కలచివేశాయి.

ఫిరోజాబాద్‌లో ఇప్పటివరకు 60 మంది డెంగీతో మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే స్థానిక మీడియా కథనాలు మాత్రం ఈ సంఖ్య 100కు పైనే ఉందని పేర్కొంటున్నాయి. ఇప్పటికే 88 మంది చిన్నారులు డెంగీతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 12వేల మంది డెంగీతో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు చాలట్లేదని, ప్రైవేటులోకి వెళ్దామంటే ఖర్చు లక్షల్లో ఉంటోందని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘‘నా ఐదేళ్ల కుమారుడికి డెంగీ సోకడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లా. చికిత్స కోసం రూ.30వేలు అడ్వాన్స్‌ కట్టమన్నారు. నేనో రోజు కూలీని. నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో ముందు చికిత్స చేయండి.. తర్వాత కడతాను అని ప్రాధేయపడ్డా. కానీ వారు ఒప్పుకోలేదు. చేసేదేం లేక ఫిరోజాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ పడకలు లేవని సిబ్బంది చేర్చుకోలేదు. దీంతో ఓ టాక్సీ మాట్లాడుకుని ఆగ్రా బయల్దేరా. కానీ మధ్యలోనే నా కొడుకు చనిపోయాడు’’ అని ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫిరోజాబాద్‌తో పాటు మథుర, ఆగ్రా, మెయిన్‌పురి ప్రాంతాల్లోనూ డెంగీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని