CBSE Warning: ఏప్రిల్‌ 1 లోపు పాఠశాలలు తెరవొద్దు.. CBSE ఘాటు హెచ్చరిక

ఏప్రిల్‌ 1 కంటే ముందు పాఠశాలలు ప్రారంభిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అనుబంధ సంస్థలకు సీబీఎస్‌ఈ (CBSE) హెచ్చరించింది. ఈ మేరకు సెక్రెటరీ అనురాగ్‌ త్రిపాఠీ (Anurag Tripathi) ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 18 Mar 2023 19:45 IST

దిల్లీ: పాఠశాలల రీఓపెనింగ్‌ విషయంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) తన అనుబంధ పాఠశాలలను హెచ్చరించింది. ఏప్రిల్‌ 1 లోపు పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని ఆదేశించింది. కాదని యాజమాన్యాలు క్లాసులు ప్రారంభిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. పది, పన్నెండో తరగతి విద్యార్థులకు అకడమిక్‌ సంవత్సరం (Academic Year) ప్రారంభానికి ముందే క్లాసులు ప్రారంభిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

అకడమిక్‌ సంవత్సరం ప్రారంభానికి ముందే కొన్ని సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు క్లాసులు ప్రారంభిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. నిర్దేశించిన సమయం కంటే ముందుగానే సిలబస్‌ పూర్తి చేసేందుకు ప్రయత్నించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వాళ్లు తీవ్ర అందోళనకు గురవుతారు. ప్రశాంతంగా నేర్చుకునేందుకు వీలుండదు

- అనురాగ్‌ త్రిపాఠి, సీబీఎస్‌ఈ సెక్రెటరీ

జీవన నైపుణ్యాలు (లైఫ్‌ స్కిల్స్‌), ఆరోగ్యం, వ్యాయామం, సామాజిక సేవ తదితర బోధనేతర అంశాలపై దృష్టి సారించేందుకు విద్యార్థులకు పాఠశాలలు తగినంత సమయం ఇవ్వడం లేదని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అనురాగ్‌ తెలిపారు. ‘‘విద్యార్థికి చదువుతోపాటు బోధనేతర అంశాలు కూడా ముఖ్యమే. సీబీఎస్‌ఈ అనుంబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు బోర్డు జారీ చేసిన షెడ్యూల్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి మార్చి 31 వరకు సీబీఎస్‌ఈ నిర్దేశించిన షెడ్యూల్‌ యథాతథంగా అమలయ్యేలా వారు చర్యలు తీసుకోవాలి’’ అని అనురాగ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పదో తరగతి, పన్నెండో తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ ప్రస్తుతం బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ రెండు తరగతులకు ఫిబ్రవరి 15న పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదో తరగతి విద్యార్థులకు మార్చి 21న, పన్నెండో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 5తో పరీక్షలు ముగియనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని