Dynasty politics: అందుకే ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేశాం : ఏక్‌నాథ్‌ శిందే

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) ఎదురుదాడికి దిగారు.

Published : 14 Jan 2024 16:04 IST

ముంబయి: మహారాష్ట్రలో అధికార, విపక్షాల మధ్య ‘కుటుంబ రాజకీయాలు’ (Dynasty politics) అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) ఎదురుదాడికి దిగారు.2019 ఎన్నికల్లో (Loksabha Elections) తన కుమారుడిని లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించడాన్ని సమర్థించుకున్నారు. ఆ సమయంలో పార్టీకి ఉన్నత విద్యావంతులు, యువ నేత అవసరం అయినందునే అలా చేయాల్సి వచ్చిందన్నారు.

‘ఉన్నత విద్యావంతుడు, యువకుడిని బరిలో దింపాలని 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ భావించింది. ఆ క్రమంలోనే శ్రీకాంత్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చింది. ఆయన విజయం సాధించారు. దాంతో పార్టీ బలం మరింత పెరిగింది. దేశాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే.. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే (2019-22) మహారాష్ట్రను 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. అందుకే ఆయన ప్రభుత్వాన్ని కూలదోశాం. ఒక్కరి అహాన్ని సంతృప్తి పరచడానికి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు నిలిపివేయడం దురదృష్టకరం’ అని సీఎం ఏక్‌నాథ్‌ శిందే పేర్కొన్నారు.

లౌకికవాదానికి ఇదే అసలైన నిర్వచనం: ‘అయోధ్య’ రథసారథి ఎల్‌కే ఆడ్వాణీ

ఏక్‌నాథ్‌ శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే ప్రాతినిధ్యం వహిస్తోన్న కల్యాణ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల పర్యటించారు. కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. శిందే కుమారుడికి టికెట్టు ఇవ్వడం తప్పిదమని ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. వీటికి దీటుగా స్పందించిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే.. ఠాక్రే ఆరోపణలకు ఎటువంటి విలువ లేదన్నారు. ప్రతికూల ఫలితం వచ్చినప్పుడు వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఠాక్రేకు అలవాటేనని ఆరోపించారు. ఇదిలాఉంటే, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే కుమారుడైన ఉద్ధవ్‌ కుటుంబం కూడా రాజకీయాల్లో కొనసాగుతోంది. ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్యఠాక్రే కూడా మునుపటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని