నా కుమార్తెకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి

దేశ చరిత్రలో అతిపెద్ద నేరాల్లో నిర్భయ అత్యాచారం ఒకటి. ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత దోషులకు ఉరి అమలైంది.........

Updated : 20 Mar 2020 13:21 IST

దిల్లీ: దేశ చరిత్రలో అతిపెద్ద నేరాల్లో నిర్భయ అత్యాచారం ఒకటి. ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత దోషులకు ఉరి అమలైంది. ఈ క్రమంలో దోషులు చివరి క్షణం వరకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతటి దారుణానికి ఒడిగట్టిన వీరికి ఉరి సరి అని న్యాయదేవత సైతం ఆమోదం తెలిపింది. ఈరోజు ఉదయం 5.30గంటలకు జైలు నిబంధనల ప్రకారం దోషులు ముకేష్‌ సింగ్‌‘(32), పవన్‌ గుప్త(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌(31)లకు తిహార్‌ జైలులోని జైలు నెంబరు 3లో తలారి పవన్‌ జల్లాద్‌ ఉరిశిక్ష ప్రక్రియను పూర్తి చేశారు. వారి ఉరి సరైందే అంటూ వేలాది మంది ప్రజలు జైలు ఆవరణకు చేరుకొని మద్దతు తెలిపారు. ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 

దోషుల ఉరిపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ''నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఇన్నాళ్లకు న్యాయం జరిగింది. ఆలస్యమైనప్పటికీ చివరకు న్యాయమే గెలిచింది. దోషుల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుంది. ఈ క్రమంలో సహకరించిన న్యాయవ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు. ఉరి తప్పించుకోవడానికి దోషులు చివరి వరకు చేసిన అన్ని ప్రయత్నాల్ని కోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను నా కూతురి చిత్రపటాన్ని ఆలింగనం చేసుకుని ఈరోజు నీకు న్యాయం జరిగిందని చెప్పాను. 2012లో యావత్తు దేశం తలదించుకుంది. ఇంతటితో నా పోరాటం ఆగదు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది" అని నిర్భయ తల్లి ఆశాదేవీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విజయం సంకేతం చూపారు.  

''నా కుమార్తెకు న్యాయం జరిగింది. అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు. నిర్భయ కేసు తీర్పు మహిళల విజయం" అని ఆమె తండ్రి బద్రీనాథ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు.   

ఇవీ చదవండి: 
ఏడ్చా.. బాధపడ్డా.. భయపడ్డా.. పోరాడా..
నిర్భయ దోషుల చివరి క్షణాలు ఇలా..
నిర్భయ దోషులకు ఉరి

దోషుల పూర్వాపరాలు ఇవే..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని