బెల్జియం రాజకుమారుడికి కరోనా!

కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతలం చేస్తోంది. సామాన్యుల నుంచి రాజకుటుంబీకుల వరకు ఈ వైరస్‌ బారిన పడుతున్న వారిసంఖ్య భారీగా పెరుగుతోంది. ఇది వరకే స్పెయిన్‌ రాజకుటుంబానికి చెందిన యువరాణి మరియా థెరిసా కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.

Published : 31 May 2020 12:39 IST

బార్సిలోనా: కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతలం చేస్తోంది. సామాన్యుల నుంచి రాజకుటుంబీకుల వరకు ఈ వైరస్‌ బారిన పడుతున్న వారిసంఖ్య భారీగా పెరుగుతోంది. ఇది వరకే స్పెయిన్‌ రాజకుటుంబానికి చెందిన యువరాణి మరియా థెరిసా కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బెల్జియం రాజవంశానికి చెందిన ప్రిన్స్‌ జొవాచిమ్‌ కొవిడ్‌-19 బారినపడినట్లు ఆ దేశ రాయల్‌ ఫ్యామిలీ ప్రకటించింది. 28 ఏళ్ల జొవాచిమ్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం ఈ నెల 24న బెల్జియం నుంచి స్పెయిన్‌కి వెళ్లినట్లు పేర్కొంది. ఆ సందర్భంలో దక్షిణ స్పెయిన్‌లోని కార్డోబాలో జరిగిన ఓ పార్టీలో రాజకుమారుడితో పాటు మరో 26మంది అతని మిత్రబృందం పాల్గొన్నారు. అది జరిగిన రెండు రోజుల అనంతరం రాజకుమారుడిలో కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. అనంతరం కొవిడ్‌ పరీక్షల్లో అతనికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పార్టీలో పాల్గొన్న వారందరినీ క్వారంటైన్‌కు తరలించినట్లు స్పెయిన్‌ అధికారులు వెల్లడించారు. 

అయితే, లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ప్రిన్స్‌ తన మిత్రులతో పార్టీలో పాల్గొన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. 15మంది కంటే ఎక్కువ ప్రజలు ఒకచోట గుమికూడవద్దని నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి వీరు పార్టీలో పాల్గొన్నారని తెలిపాయి. దీనిపై ఇప్పటికే స్పానిష్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఒకవేళ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే మాత్రం దాదాపు రూ.50వేల నుంచి రూ.8లక్షల అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ఇప్పటికే వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న స్సెయిన్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నారు. ముఖ్యంగా 14సంవత్సరాలలోపు పిల్లలను మరో 6వారాల పాటు ఇంటినుంచి బయటకు రావద్దని ప్రకటించారు. ఈ సందర్భంలో రాజకుమారుడి చర్యను బాధ్యతారహితమైందిగా కార్డోబా ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు అమలుచేసే సమయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే, ప్రపంచంలో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా కొనసాగుతున్న దేశాల్లో స్పెయిన్‌ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 2లక్షల 86వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా దాదాపు 27వేల మంది మృత్యువాతపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు