75th independence day: ఇందుకు గర్విద్దాం

స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 75వ ఏట అడుగిడుతున్న ఈ నవజవ్వనికి...  

Published : 15 Aug 2021 12:36 IST

స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 75వ ఏట అడుగిడుతున్న ఈ నవజవ్వనికి...  74 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఆటుపోట్లు! వీటిలో జాతి ఐక్యతను సగర్వంగా చాటి... మనం నిజంగా గర్వించే, 
భవితకు స్ఫూర్తిగా నిలిచే కొన్ని అద్వితీయ ఘట్టాలివి. స్వతంత్ర భారత ఘనతలెన్నో...
హరితంతో త్వరితంగా..
బంగాళా దుంప... ఇప్పుడెంత విరివిగా వాడేస్తున్నామో కదా! 1940-50ల్లో మనదేశానికి ఓ భిక్షగా అమెరికా పంపిన దుంప ఇది. మనదేశంలో ఆకలి చావుల్ని కాస్తయినా నివారించడానికి అగ్రరాజ్యం అలా దయచూపింది. మనదేశంలో ఆహారకొరత ఆ స్థాయిలో ఉండేది. ఆ స్థాయి నుంచి కేవలం పదేళ్లలో ఆహార స్వయం సమృద్ధి సాధించగలిగి... అమెరికాకి మనమే అతి నాణ్యమైన ఆహా పదార్థాల్ని అందించే స్థాయికి ఎదిగాం! వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌ సహకారంతో హరిత విప్లవానికి నాంది పలికి... 1960నాటికి ఆహారధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోగలిగాం. ఏటా 300 మిలియన్ల మెట్రిక్‌ టన్నుల ఆహారోత్పత్తులతో (క్యాలరీలపరంగా) ప్రపంచంలో రెండోస్థానానికి చేరుకున్నాం. 1970లో వర్గీస్‌ కురియన్‌ ఆలోచనల ద్వారా... ప్రపంచంలోనే అతిపెద్ద డైరీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టిన భారత్‌...శ్వేత విప్లవంతో పాలవెల్లువలను సృష్టించగలిగింది.

రక్తపాతం లేకుండా....

విభజనలాంటి దారుణమైన పరిస్థితులతో ఆరంభించినా... త్వరగానే తేరుకొని 1951లోనే ప్రజాస్వామ్య పద్ధతిలో తొలి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుకున్నాం. అమెరికాలాంటి దేశం కూడా ఒకప్పుడు అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటిది విభజనలాంటి పరిస్థితులతో ఆరంభించినా... భారత్‌ నేటికీ ఎలాంటి రక్తపాతం లేకుండా ప్రతి ఐదేళ్ళకోసారి ఎన్నికలకు వెళుతోంది. పాలకులను మార్చుకుంటోంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థ కారణంగా... ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ప్రజాప్రతినిధులున్న దేశం కూడా మనదే!

అప్సరతో ఆరంభమై...

అయోమయంగా ఆరంభమైనా... 1956లోనే అప్సర పేరుతో న్యూక్లియర్‌ రియాక్టర్‌ను తయారు చేసిన మన దేశం....ఈ ఖ్యాతి గడించిన తొలి ఆసియా దేశంగా పేరు తెచ్చుకుంది. అనంతరం 1974లో పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్ష ను నిర్వహించి న్యూక్లియర్‌ దేశాల జాబితాలో సగర్వంగా నిలబడింది.

మానవీయ ఆర్థిక సంస్కరణలు...

ఆర్థిక సంస్కరణలంటే కఠిన నిర్ణయాలు... ఉన్న ఉద్యోగాలు కోల్పోవటం! ప్రపంచవ్యాప్త అనుభవమిది. కానీ 1992లో పీవీ నరసింహారావు సారథ్యంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు... దేశాన్ని కొత్త పుంతలు తొక్కించటమే కాకుండా మానవీయ కోణాన్నీ ఆవిష్కరించాయి. పాత ఉద్యోగాలు పోవటం కాకుండా... కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేశాయి. లైసెన్స్‌ రాజ్‌ రద్దుతో మార్కెట్‌ పుంజుకుని... యువతరానికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. 

మంగళయాన్‌లో మనమే తొలిసారి...

సదుపాయాలు అంతంతే అయినా... మన శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలపైనా దృష్టి సారించారు. రష్యా సహకారంతో 1975లోనే తొలి ఉపగ్రహం ఆర్యభట్టను విజయవంతంగా ప్రయోగించటంతో మొదలైన ప్రస్థానం ఆగకుండా సాగుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మంగళయాన్‌లో... ప్రపంచంలో మరే దేశానికీ సాధ్యంకాని ఘనతను సాధించింది మన భారతావని. తొలి ప్రయత్నంలోనే ఉపగ్రహాన్ని మార్స్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనత భారత శాస్త్రవేత్తలదే!

తలదించుకోవాల్సినవి..
ఎమర్జెన్సీ
భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన
బాబ్రీ మసీదు విధ్వంసం
1984లో సిక్కుల ఊచకోతమెరుగుపడాల్సినవి
సమాఖ్య స్ఫూర్తి
ఎన్నికల సంస్కరణలు
ప్రజాహిత పాలన (వలసవాసనల్లేని పాలన)
మాతృభాషకు ప్రాధాన్యం

అమెరికాకు సాధ్యం కానిది మనకైంది

ఒకప్పుడు మన గ్రామంలో చాలా మందికి పేర్లే ఉండేవి కావు... ముఖ్యంగా దళిత వర్గాలకీ, స్త్రీలకీ! ఫలానా ఎర్రయ్యగారి పాలేరనో, పాలేళ్ల కుటుంబానికి చెందిన పిల్లికళ్లవాడనో, ఎర్రముక్కువాడనే గుర్తుపట్టేవారు. స్త్రీలు కూడా అంతే... ఫలానా వాళ్ల భార్య అనో, తల్లనో తప్ప ప్రత్యేకంగా వాళ్ల పేర్లు ఎవరికీ తెలిసేవి కావు. ఆ పరిస్థితిని మార్చి అందరికీ పేరంటూ ఉండాల్సిన అవసరాన్ని తెచ్చింది ఓటుహక్కే! మనదేశంలో 1920 నుంచే ఓటు పద్ధతి ఉంది కానీ... అందరూ ఓట్లేయడానికి వీల్లేదు. సొంతిల్లు ఉన్నవాళ్లూ, పొలాలున్నవారు, చదువుకున్న వాళ్లూ... కొందరికే పరిమితం ఓటు. స్వాతంత్య్రం తర్వాత వయోజనులందరికీ ఓటుహక్కు ఇచ్చాం. ‘అక్షరం ముక్కరానివాళ్లకీ ఓట్లా’ అని దేశాలన్నీ ఎద్దేవా వేసినా... భారత ప్రజల విజ్ఞతకీ చదువుకీ సంబంధం లేదని మళ్లీమళ్లీ చాటుతూనే వస్తున్నారు జనాలు! స్త్రీల విషయంలోనూ అదే జరిగింది. అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికాలో ఓటు హక్కు స్త్రీలకు దక్కటానికి దాదాపు 150 సంవత్సరాలు పట్టింది. మనం ఎలాంటి వివక్ష లేకుండా తొలిరోజు నుంచే ఇచ్చేశాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని