77th Independence Day 2023: భారత్‌లో సరికొత్త విశ్వాసం

భారత దేశంలో సరికొత్త విశ్వాసం కనిపిస్తోందని, సోదర భావాన్ని ప్రజలంతా మరింత ముందుకు తీసుకెళ్లాలని, కుల, మత, ప్రాంతీయ తత్వాలకన్నా భారతీయత గొప్పదని చాటాలని పిలుపునిచ్చారు.

Updated : 15 Aug 2023 08:12 IST

సోదర స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలి
కుల, మత, ప్రాంతీయతత్వాలకన్నా భారతీయతే గొప్పదని చాటాలి  
సహానుభూతిలో మహిళలకు సాటిలేరెవరు..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం

ఈనాడు, దిల్లీ: భారత దేశంలో సరికొత్త విశ్వాసం కనిపిస్తోందని, సోదర భావాన్ని ప్రజలంతా మరింత ముందుకు తీసుకెళ్లాలని, కుల, మత, ప్రాంతీయ తత్వాలకన్నా భారతీయత గొప్పదని చాటాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సరికొత్త ఆశల దీపంగా భారత్‌ వెలుగొందుతోందని పేర్కొన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘మానవత్వం తప్పుదారి పట్టినప్పుడు మహిళలు సహానుభూతి ప్రాధాన్యాన్ని చాటి మానవాళికి సరైన మార్గాన్ని చూపుతుంటారు’ అని పేర్కొన్నారు. ‘దురాశ ప్రపంచాన్ని ప్రకృతికి దూరంగా తీసుకెళ్తోంది. అయితే మళ్లీ మూలాలకు వెళ్లాల్సిన ఆవశ్యకతను మనం ఇప్పుడు గ్రహించాలి. ప్రకృతితో మమేకమై జీవించే ఎన్నో గిరిజన సముదాయాలు ఇప్పటికీ ఉన్నాయి. వాతావరణపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి వారి జీవన విధానం విలువైన పాఠాలు నేర్పుతోంది. శతాబ్దాల తరబడి గిరిజన సమూహాలు మనుగడ సాగించడం వెనకున్న రహస్యం ప్రకృతిపట్ల వారు చూపుతున్న సహానుభూతే. అయితే కొన్నిసార్లు ప్రపంచంలో ఆ సహానుభూతి లోపిస్తోంది. దీన్ని సరిదిద్దుకోవాలి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు వెంటనే వాతావరణ మార్పులపై దృష్టి సారించాలి. దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటే, మరికొన్ని ప్రాంతాలు కరవును చవి చూస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పని చేయాలి. ఈ విషయంలో భారత్‌ గుర్తించదగ్గ మైలురాళ్లను అధిగమిస్తోంది’ అని పేర్కొన్నారు.

ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నా

‘నవ భారతానికి అనంతమైన ఆకాంక్షలున్నాయి. ప్రస్తుతం ఇస్రో కొత్త శిఖరాలకు చేరుకుని పని తీరులో సరికొత్త కొలమానాలను నిర్దేశించుకుంటోంది. ఈ ఏడాది చంద్రయాన్‌-3ని ప్రయోగించింది. దాని లాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ మరికొన్ని రోజుల్లో చంద్రుడిపై కాలుమోపనున్నాయి. గర్వకారకమైన ఆ క్షణాల కోసం నేను ఎదురు చూస్తున్నా. భవిష్యత్తు అంతరిక్ష కార్యక్రమాలకు ఇది మొదటి అడుగే. ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది’ అని ముర్ము పేర్కొన్నారు.

చరిత్రతో అనుసంధానం కావాలి

చరిత్రతో తిరిగి అనుసంధానం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందర్భం స్వాతంత్య్ర దినోత్సవం. మనం ప్రస్తుత పరిస్థితులను మదింపు చేసుకుని ఏ దిశలో ముందడుగు వేయాలో నిర్ణయించుకోవాలి. ప్రపంచానికి సరైన మార్గాన్ని నిర్దేశించడానికి జీ-20 సమావేశాలు ఒక ముఖ్య వేదిక. ఈ సదస్సుకు నాయకత్వం వహించడం ద్వారా భారత్‌ వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో తీసుకొనే నిర్ణయాలు ప్రగతికి దోహదపడేలా ప్రభావితం చేయగలవు’ అని వివరించారు. 

అందరికీ సమాన హక్కులు

‘మనలో ప్రతి ఒక్కరికీ ఎన్నో గుర్తింపులున్నాయి. కులం, మతం, భాష, ప్రాంతంతోపాటు మనం కుటుంబాలు, వృత్తులద్వారా గుర్తింపు పొందాం. వీటన్నింటికీ అతీతంగా భారతీయ పౌరులుగా మనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మనమంతా సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు, బాధ్యతలున్నాయి. మహాత్మా గాంధీ నేతృత్వంలో ఎంతో మంది మహానుభావులు మన స్వాతంత్య్ర సమరాన్ని ముందుకు నడిపించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిపారు. ఈ పోరాటంలో మహిళల పాత్ర వెలకట్టలేనిది. పోరాటం చేసిన వారిలో మాతంగినీ హజ్రా, కనకలత బారువా, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, అమ్ము స్వామినాథన్‌, అరుణా అసఫ్‌ అలీ, సుచేతా కృపలానీ తదితర నాయకురాళ్లున్నారు’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

స్ఫూర్తి నింపారు: మోదీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ప్రజల్లో స్పూర్తి నింపారని ప్రధాని మోదీ ప్రశంసించారు. బహుముఖ అభివృద్ధి దార్శనికతను ఆమె ఆవిష్కరించారని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని