ఆ బాల రాముడే మా ఇంట పుట్టాడు..

అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన దివ్యముహూర్తంలోనే బిడ్డకు జన్మనివ్వాలని కలలు కన్న దంపతులు వైద్యులను సంప్రదించి సోమవారమే(22వ తేదీ) కాన్పు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

Updated : 23 Jan 2024 09:38 IST

ప్రాణప్రతిష్ఠ రోజునే పెద్ద సంఖ్యలో కాన్పులు
సిజేరియన్లకూ సిద్ధమై గర్భిణుల ప్రసవం

కాన్పుర్‌: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన దివ్యముహూర్తంలోనే బిడ్డకు జన్మనివ్వాలని కలలు కన్న దంపతులు వైద్యులను సంప్రదించి సోమవారమే(22వ తేదీ) కాన్పు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే సిజేరియన్లకూ సిద్ధమయ్యారు. కోరుకున్నట్లే ప్రాణప్రతిష్ఠ రోజున పుట్టిన బుజ్జాయిలను చూసి ఆ శ్రీరాముడే తమ ఇంట పుట్టాడని మురిసిపోయారు. చాలా మంది మగబిడ్డలకు రామ్‌ అని, ఆడపిల్లలకు సీత అని పేర్లు పెట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఫర్జానా అనే ముస్లిం మహిళ తన శిశువుకు రామ్‌ రహీం అని పేరు పెట్టుకున్నారు.

బిహార్‌లోని పట్నాలో పలు ఆసుపత్రుల్లో సోమవారం 500 మంది శిశువులు జన్మించినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో వివిధ ఆసుపత్రుల్లో సోమవారం కనీసం 47 మంది శిశువులు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ గణేశ్‌ శంకర్‌ ఆసుపత్రిలో 25 మందికి కాన్పులు జరిగినట్లు వైద్యులు తెలిపారు. చాలా మంది తమ బిడ్డలకు రామ్‌ అని లేదా ఆ పేరును సూచించే రాఘవ్‌, రాఘవేంద్ర, రఘు, రామేంద్ర లాంటి పేర్లు పెట్టుకున్నారు. సంభల్‌ జిల్లాలోని ఓ ఆసుపత్రి కాన్పుల వార్డులో అయోధ్య రామ మందిర నమూనాను ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని విజయపురలో జె.ఎస్‌.ఎస్‌. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో సోమవారం 20 మందికిపైగా మహిళలకు కాన్పులు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని