బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం.. భూపేశ్‌ బఘేల్‌పై కేసు

మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది.

Published : 18 Mar 2024 05:20 IST

రాయ్‌పుర్‌: మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. ఈడీ నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు తెలిపారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన ఈడీ అప్పట్లో సంచలన విషయాలు వెల్లడించింది. యాప్‌ ప్రమోటర్లు అప్పుడు ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా ఉన్న భూపేశ్‌ బఘేల్‌కు రూ.508 కోట్లమేర ఇచ్చినట్లు ఆరోపించింది. ఈ కేసు విచారణ సమయంలో బఘేల్‌పై యాప్‌ ప్రమోటర్‌ శుభమ్‌ సోనీ ఆరోపణలు చేశాడు. బెట్టింగ్‌ యాప్‌ను రూపొందించేందుకు సీఎంగా ఉన్న బఘేల్‌ తనను ప్రోత్సహించడంతోనే ఆయనకు రూ.508 కోట్లు చెల్లించానని చెప్పాడు. ఈ కేసులో తన సహచరులు అరెస్టయిన తర్వాత యూఏఈకి పారిపోవాలని బఘేల్‌ తనకు సలహా ఇచ్చినట్లు తెలిపాడు. భాజపా చేస్తున్న ఉద్దేశపూర్వక దుష్ప్రచారంగా ఈ ఆరోపణలను అప్పట్లో బఘేల్‌ ఖండించారు. తాజాగా ఈడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బఘేల్‌తోపాటు యాప్‌ ప్రమోటర్లు రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రాకర్‌, శుభమ్‌ సోనీ, అనిల్‌కుమార్‌ అగర్వాల్‌ సహా మొత్తం 18 మందిపై ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేసింది.

భాజపాది రాజకీయ వేధింపు : బఘేల్‌

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడం రాజకీయ వేధింపులో భాగమేనని ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజనందగావ్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బఘేల్‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రంలో ఓటమి తప్పదన్న భయంతోనే భాజపా ఈ ఎత్తులు వేస్తోందన్నారు. మహదేవ్‌ యాప్‌పై తన ప్రభుత్వం 72 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి, దాదాపు 450 మందిని అరెస్టు చేసిందన్నారు. భాజపా సర్కారు ఇప్పటిదాకా ప్రమోటర్లను అరెస్టు చేయలేదంటూ.. అవగాహన ఏమైనా కుదిరిందా అని బఘేల్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు