చంద్రయాన్‌-3 ప్రయోగంలో 4 సెకన్ల జాప్యం

చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3..  ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకన్లపాటు ఆలస్యంగా బయలుదేరింది.

Published : 30 Apr 2024 04:43 IST

అంతరిక్ష వ్యర్థాలను తప్పించుకోవడానికే..
ఇస్రో నివేదిక వెల్లడి

దిల్లీ: చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3..  ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకన్లపాటు ఆలస్యంగా బయలుదేరింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ‘కొలిజన్‌ ఆన్‌ లాంచ్‌ అవాయిడెన్స్‌’ (కోలా) విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చంద్రయాన్‌-3 వ్యోమనౌకను ఎల్‌వీఎం-3 రాకెట్‌ ద్వారా గత ఏడాది జులై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. నాడు ప్రయోగంలో నాలుగు సెకన్ల పాటు జాప్యం చేయడం వల్ల చంద్రయాన్‌-3 వ్యోమనౌకకు ముప్పు తప్పింది. అది ఎలాంటి ఇబ్బంది లేకుండా చందమామ దిశగా పయనం సాగించగలిగింది. ఇలాంటి ముప్పును తప్పించుకోవడానికి గత ఏడాది జులై 30న పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగాన్ని నిమిషం పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. దానికి మూడు నెలల ముందు (ఏప్రిల్‌ 24న) సింగపూర్‌కు చెందిన టెలియోస్‌-2 ఉపగ్రహ ప్రయోగంలోనూ ఇలా స్వల్ప జాప్యం చేయాల్సి వచ్చింది. గత ఏడాది అంతరిక్ష వ్యర్థాల బారి నుంచి తన ఉపగ్రహాలను రక్షించుకోవడానికి ఇస్రో 23సార్లు విన్యాసాలు చేయాల్సి వచ్చింది. గత 60 ఏళ్లలో అంతరిక్ష ప్రయోగాల వల్ల భూమి చుట్టూ రాకెట్‌, ఉపగ్రహ శకలాలు భారీగా పెరిగిపోయాయి. వీటిని ఎప్పటికప్పుడు అంతరిక్ష సంస్థలు పరిశీలిస్తున్నాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని