1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి

బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్‌ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Published : 07 May 2024 04:17 IST

మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్‌ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికను జులై 19వ తేదీకల్లా సమర్పించాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. 2022 నవంబరు 4నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై ధర్మాసనం మండిపడింది. జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ కమిషన్‌ సిఫార్సులను మరోసారి పరిశీలించి వాటి అమలుకు సంబంధించిన పురోగతిని వివరించాలని తెలిపింది. తదుపరి విచారణను జులై 26వ తేదీకి వాయిదా వేసింది. సిఫార్సుల్లో ఒక కీలకాంశం...మహారాష్ట్ర పోలీస్‌ శాఖలోని 2.30లక్షల మంది సిబ్బందికి గృహ వసతి కల్పించడం. బాబ్రీమసీదు కూల్చివేత ఘటన అనంతరం 1992 డిసెంబరు 6న, ఆ తర్వాత ముంబయిలో దాడులు జరగడానికి దారితీసిన పరిస్థితులపై మహారాష్ట్ర ప్రభుత్వం 1993 జనవరి 25న అప్పటి బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ నేతృత్వంలో దర్యాప్తు కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ నివేదికలోని సిఫార్సులను ఆమోదిస్తున్నట్లు 2022లో రాష్ట్ర ప్రభుత్వం తెలుపగా నోట్‌ చేసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. అవి అమలుకావడంలో జాప్యంపై మండిపడుతూ నివేదికకు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని