Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్‌ అకౌంట్‌ బ్లాక్‌.. హైకోర్టు నోటీసులు

Google account: చిన్నప్పటి ఫొటోను అప్‌లోడ్‌ చేసిన కారణంగా గూగుల్‌ ఓ వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. దీనిపై అతడు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించాడు.

Updated : 18 Mar 2024 18:10 IST

Google account | అహ్మదాబాద్‌: చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వ్యక్తికి గూగుల్‌ (Google) షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకుండాపోయింది. చివరికి గుజరాత్‌ హైకోర్టు తలుపుతట్టాడు. దీంతో సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏమైందంటే?

గుజరాత్‌కు చెందిన కంప్యూటర్‌ ఇంజినీర్‌ నీల్‌శుక్లా చిన్నప్పటి జ్ఞాపకాలను పదిలపర్చుకోవడంలో భాగంగా కొన్ని ఫొటోలను గతేడాది ఏప్రిల్‌లో గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేశాడు.    తన రెండేళ్ల వయసులో నాన్నమ్మ అతడికి స్నానం చేయిస్తున్న ఫొటో కూడా అందులో ఉంది. ఫొటోలో దుస్తుల్లేకుండా ఉండడం ‘చైల్డ్‌ అబ్యూజ్‌’ కిందకు వస్తుందంటూ అతడి ఖాతాను గూగుల్‌ బ్లాక్‌ చేసింది. దీంతో వివరణ ఇస్తూ ఖాతాను పునరుద్ధరించాలని గూగుల్‌ను పదే పదే అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. దీంతో కోర్టును ఆశ్రయించాడు.

ఐపీఎల్‌ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్‌లు

ఏడాదిగా ఖాతా నిలిచిపోవడం వల్ల ఇ-మెయిల్‌ అకౌంట్‌ను వినియోగించలేకపోతున్నానని శుక్లా తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ముఖ్యమైన ఇ-మెయిల్స్‌ చూడలేని కారణంగా తన వ్యాపారానికి నష్టం వాటిల్లిందని తెలిపాడు. ఈ విషయమై గుజరాత్‌ పోలీసులకు, భారత్‌లో నోడల్‌ ఏజెన్సీ అయిన సెంటర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. ఖాతాను నిలిపివేసి ఏడాది కావొస్తుండడంతో మరోసారి గూగుల్‌ అతడికి నోటీసులు పంపింది. ఖాతాతో అనుసంధానమై ఉన్న డేటా మొత్తాన్ని ఏప్రిల్‌ కల్లా తొలగిస్తామని పేర్కొంది. ఈ వ్యవహారంపై సత్వరమే విచారణ జరపాలని న్యాయస్థానాన్ని న్యాయవాది ద్వారా ఆశ్రయించాడు. దీంతో కోర్టు.. గూగుల్‌తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్చి 26లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని