Gujarat: గుజరాత్‌ పోలింగ్‌ వేళ.. రూ.478 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

ఎన్నికల వేళ గుజరాత్‌లో భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపుతోంది. వడోదరలోని ఓ చిన్న ఫ్యాక్టరీలో రూ.478కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు.

Published : 01 Dec 2022 01:23 IST

అహ్మదాబాద్‌: తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమవుతున్న వేళ గుజరాత్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాల పట్టివేత కలకలం రేపుతోంది. వడోదర శివారులోని ఓ తయారీ యూనిట్‌లో పెద్ద మొత్తంలో నిషేధిత మెఫిడ్రోన్‌ డ్రగ్స్‌, దాని ముడి పదార్థాలను యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.478.65కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వడోదర జిల్లాలోని సింధ్రోత్‌ జిల్లా సమీపంలోని ఓ చిన్న ఫ్యాక్టరీ గోదాంలో డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా ఏటీఎస్‌కు సమాచారం అందింది. దీంతో ఆ ఫ్యాక్టరీపై బుధవారం అధికారులు దాడి చేశారు. మెటల్‌ షీట్స్‌ తయారు చేస్తున్నట్లు చెబుతున్న ఆ ఫ్యాక్టరీలో ఎండీ డ్రగ్‌ పేరుతో మెఫిడ్రోన్‌ను తయారుచేస్తున్నట్లు ఈ సోదాల్లో బయటపడింది. ఈ దాడుల్లో 63.7 కేజీల మెఫిడ్రోన్‌, 80.26 కేజీల ముడిపదార్థాలు, తయారీ మిషన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వడోదరకు చెందిన సౌమిల్ పాఠక్‌ అనే వ్యక్తి.. డార్క్‌ వెబ్‌ ద్వారా నార్కోటిక్‌ డ్రగ్స్‌ తయారీని నేర్చుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో సౌమిల్.. తన స్నేహితులతో కలిసి ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో ఒకరు కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌ అని చెప్పారు.

గుజరాత్‌లో గురువారం (డిసెంబరు 1) అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఈ సమయంలో భారీ ఎత్తున డ్రగ్స్‌ బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ఎన్నికల సంఘం స్పందించింది. 2017 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో 28 రెట్లు అధికంగా మాదకద్రవ్యాల పట్టివేత జరిగిందని ఈసీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని