Indian Envoy Meets Taliban Leader: తాలిబన్లతో భారత్‌ చర్చలు

భారత్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నట్టు ప్రకటించిన తాలిబన్లు ఖతార్‌లో భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌తో సమావేశమయ్యారు. తాలిబన్ల వైపు నుంచి వచ్చిన ......

Updated : 31 Aug 2021 19:43 IST

దోహా: భారత్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నట్టు ఇదివరకే ప్రకటించిన తాలిబన్లు ఖతార్‌లో భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌తో సమావేశమయ్యారు. తాలిబన్ల వైపు నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్టు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో నిర్ధారించింది. తాలిబన్లతో భారత్‌ ప్రతినిధులు భేటీ కావడం ఇదే తొలిసారి. దోహాలోని తాలిబన్ల రాజకీయ కార్యాలయం అధిపతి షేర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ స్టానీజాయి భారత రాయబార కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించడంతో పాటు భారత్‌కు రావాలని కోరుకుంటున్న మైనార్టీల తరలింపు అంశంపై ప్రధానంగా చర్చించారు. కాబుల్‌లో ఉగ్ర ఘటనలపై ఆందోళన వ్యక్తంచేసిన భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌.. అఫ్గాన్‌ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదానికి తావులేకుండా చూడాలని సూచించారు. ఈ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవడంపై తాలిబన్‌ ప్రతినిధి హామీ ఇచ్చినట్టు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 

భారతీయుల తరలింపుపై కేంద్రం దృష్టి..

మరోవైపు, అఫ్గానిస్థాన్‌ విషయంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం దృష్టిపెట్టింది. అమెరికా బలగాలు అఫ్గాన్‌ను పూర్తిగా వీడిన దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ సభ్యులుగా ఉన్నారు. అఫ్గాన్‌ నుంచి భారతీయులు, మైనార్టీలను తీసుకొచ్చే అంశంపై కేంద్రం ప్రధానంగా దృష్టిపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని