India Corona: రెండేళ్ల వ్యవధిలో నాలుగు కోట్ల కరోనా కేసులు..!

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టి రెండేళ్లు కావొస్తోంది.

Published : 26 Jan 2022 10:00 IST

నిన్న 11 శాతం పెరిగిన కొత్త కేసులు.. భారీగానే మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించి రెండేళ్లు కావొస్తోంది. ఈ సమయంలో దశలవారీగా వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటి వరకూ నాలుగు కోట్ల కరోనా కేసులు వెలుగు చూశాయి. 4,91,127 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలను వెల్లడించింది.

మంగళవారం 17 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిచంగా.. 2,85,914 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 11.7 శాతం వృద్ధి నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 16 శాతానికి పెరిగింది. ఒక్క కేరళలోనే 55,475 కేసులొచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు కేసుల పరంగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 665 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 154, మహారాష్ట్రలో 86 మరణాలు సంభవించాయి. ఇటీవల కేసుల్లో ఆకస్మిక పెరుగుదల లేనప్పటికీ.. మరణాలు మాత్రం ఎక్కువగానే నమోదవుతున్నాయి.

వ్యాప్తి కట్టడిలో ఉండటంతో రికవరీల సంఖ్య మెరుగ్గా ఉంది. మరోరోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే అధికంగా ఉంది. నిన్న 2,99,073 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 3.73 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 93.23 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 5.55 శాతంగా ఉంది. 22లక్షలకు పైగా క్రియాశీల కేసులున్నాయి. ఇక నిన్న 59లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకూ 163 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని