US: 6 నెలల్లో అమెరికాపై ఉగ్రదాడి జరగొచ్చు..!

ఉగ్రముప్పును నిర్మూలించడం ద్వారా అఫ్గానిస్థాన్‌లో తమ లక్ష్యం నెరవేరిందంటూ అక్కడి నుంచి సర్దుకుని వెళ్లిపోయింది అమెరికా. కానీ అగ్రరాజ్యం అంచనా లెక్క

Published : 27 Oct 2021 10:29 IST

అగ్రరాజ్యానికి పొంచి ఉన్న అఫ్గాన్‌ ఐఎస్‌ ముప్పు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్రముప్పును నిర్మూలించడం ద్వారా అఫ్గానిస్థాన్‌లో తమ లక్ష్యం నెరవేరిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అమెరికా. కానీ, అగ్రరాజ్యం అంచనా లెక్క తప్పింది. అమెరికా సేనలు అటు వెళ్లగానే.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ తాలిబన్లు ఏకంగా దేశాన్ని ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇంకేముంది.. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ఉగ్రసంస్థలు మళ్లీ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా అమెరికా నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. అఫ్గాన్‌ భూభాగం నుంచి అమెరికాకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని, ఆరు నెలల్లో ఆ దేశంలోని ఇస్లామిక్‌ స్టేట్‌ దాడికి యత్నించే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు పెంటగాన్‌ సీనియర్‌ అధికారి ఒకరు తాజాగా అక్కడి కాంగ్రెస్‌కు తెలిపారు. 

అఫ్గాన్‌లో 20ఏళ్ల యుద్ధాన్ని ముగించిన అమెరికాకు ఇప్పటికీ ఆ దేశం నుంచి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని పెంటగాన్‌ అధికారులు తెలిపారు. నిజానికి ఇస్లామిక్‌ స్టేట్‌.. తాలిబన్లకు శత్రువే. ఇటీవలికాలంలో అఫ్గాన్‌లో ఐఎస్‌ అనేక దాడులు జరిపి వందల మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో ఐఎస్‌ ఆట కట్టించేందుకు తాలిబన్‌ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని భావిస్తోంది. అయితే ఇస్లామిక్‌ స్టేట్‌తో తాలిబన్‌ పోరాడి గెలవగలదా అనేది ఇంకా అస్పష్టమేనని, అందువల్ల అగ్రరాజ్యానికి ముప్పు తొలగిపోలేదని అన్నారు. 

ఇస్లామిక్‌ స్టేట్‌లో కొన్ని వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని, ఆరు నెలల్లో అమెరికాపై దాడి చేసేలా ఆ సంస్థ తన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని పెంటగాన్‌ అధికారులు వెల్లడించారు. అటు ఆల్‌ఖైదా కూడా మరోసారి దేశానికి సమస్య కానుందని తెలిపారు. తాలిబన్ల సంరక్షణలో అఫ్గాన్‌ గడ్డపై అల్‌ఖైదా మళ్లీ పుంజుకొనే అవకాశం ఉందని, రానున్న ఒకటి రెండేళ్లలో అమెరికా భూభాగంపై దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని అమెరికా నిఘా సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పినట్లు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని