Arvind Kejriwal: ఈడీ విచారణకు హాజరవుతా.. కానీ: కేజ్రీవాల్‌

Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వెల్లడించారు.

Updated : 04 Mar 2024 10:07 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi excise policy case)లో గత కొంతకాలంగా ఈడీ (ED) సమన్లను తిరస్కరిస్తూ వస్తోన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే, మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని అన్నారు. ఈ మేరకు తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో సీఎం పేర్కొన్నట్లు దిల్లీ ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.

ఈ కేసులో విచారణ నిమిత్తం మార్చి 4న రావాలని ఇటీవల కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసారీ గైర్హాజరైన సీఎం.. ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతానని అన్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

నన్ను క్షమించలేనని మోదీ అప్పుడే చెప్పారు.. టికెట్‌ దక్కకపోవడంపై ప్రజ్ఞా ఠాకుర్‌

దిల్లీ మద్యం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్‌ 2న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులు పంపిస్తున్నప్పటికీ హాజరు కావడం లేదు. సమన్లకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్దిరోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని