Veena George: తప్పుడు ప్రచారం ఆపండి.. వీణా జార్జ్‌

రాష్ట్రంలో పాఠశాలలకు పరీక్షల సమయం కావడంతో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఆశించినంత వేగం లేదనీ.. ఈ కాలంలో ఇమ్యునైజేషన్‌ వేగం తక్కువగానే ఉంటుందని తాము ముందే చెప్పినట్టు గుర్తు చేశారు. ...

Published : 05 Apr 2022 23:03 IST

తిరువనంతపురం: కేరళలో చిన్నారులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గాడి తప్పిందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఖండించారు. ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం బాగానే కొనసాగుతోందనీ.. 12-14 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు ఇప్పటివరకు 57,025 డోసులు పంపిణీ జరిగిందని వెల్లడించారు. 12-14 వయసు కలిగిన పిల్లలకు టీకా పంపిణీ కార్యక్రమం మొదలై మూడు వారాలు గడుస్తున్నా కేరళలో ఇంకా 751 మందికి మాత్రమే టీకా ఇచ్చారంటూ ఒక వర్గం మీడియాలో వచ్చిన కథనాలు పూర్తి నిరాధారమని ఆమె కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొవిన్‌ పోర్టల్‌ ద్వారానే ఈ డ్రైవ్‌ జరుగుతోందనీ.. రాష్ట్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లోనూ వ్యాక్సినేషన్‌ బులిటెన్‌ ఇస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో పాఠశాలలకు పరీక్షల సమయం కావడంతో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఆశించినంత వేగం లేదనీ.. ఈ కాలంలో ఇమ్యునైజేషన్‌ వేగం తక్కువగానే ఉంటుందని తాము ముందే చెప్పినట్టు గుర్తు చేశారు. పిల్లలకు పరీక్షలు పూర్తికాగానే ఆరోగ్య, విద్యాశాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 15 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన వారిలో 12,10,093 మందికి (79శాతం) తొలి డోసు పంపిణీ చేయగా.. 7,26,199 మందికి (47శాతం) రెండు డోసులూ పూర్తయ్యాయని వీణా జార్జ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని