Lalu Prasad Yadav: రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన కుమార్తె రోహిణి ఆచార్యను ఆర్జీడీ కంచుకోట అయిన సరన్‌ నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు పార్టీ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి.    

Published : 18 Mar 2024 19:44 IST

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav) తన కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya)ను ఆర్జీడీ కంచుకోట అయిన సరన్‌(Saran) నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు పార్టీ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. లాలూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన  బిహార్ శాసనమండలి సభ్యుడు సునీల్‌కుమార్‌ సింగ్‌ ఆదివారం తన సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తుంది. సునీల్ కుమార్‌ తన పోస్టులో ‘‘డాక్టర్ రోహిణి ఆచార్య తండ్రిపై ప్రేమ, భక్తి, అంకితభావానికి ప్రతీక. సరన్‌లోని పార్టీ కార్యకర్తలంతా రోహిణిని ఆ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.’’ అని పేర్కొన్నారు.

ఆర్జేడీకి కంచుకోట అయిన సరన్‌ నుంచి పోటీ చేసే రోహిణి  బిహార్‌ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్‌, రబ్రీ దేవీల నాలుగో సంతానం. ఆమె సోదరుడు తేజస్వియాదవ్ బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కాగా, మరో ఇద్దరు తోబుట్టువులు తేజ్ ప్రతాప్ యాదవ్, మిసా భారతి బిహార్ అసెంబ్లీ, రాజ్యసభ సభ్యులు. రోహణి వృత్తిరీత్యా వైద్యురాలు. లాలూ స్నేహితుడు, రిటైర్డ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారి అయిన రాయ్‌ రణవిజయ్‌సింగ్‌ కుమారుడు సుమేష్‌ సింగ్‌ను ఆమె వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. ఈనెల మొదట్లో పట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ప్రతిపక్షాల జన్‌ విశ్వాస్ ర్యాలీలో రోహిణి తన తండ్రితో కలిసి వేదిక పైకి వచ్చారు. లాలూ ఆమెను ర్యాలీలో ప్రజలకు పరిచయం చేశారు. అప్పట్లోనే ఈ చర్య రోహిణి రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలకు దారి తీసింది.

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రోహిణి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు విసురుతుంటారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రికి తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేసి  తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకొని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోహిణి పోటీ చేయనున్నారనే వార్తలు వచ్చినా అలా జరగలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని