India-Maldives Conflict: మార్చి 15 కల్లా సైన్యాన్ని వెనక్కి పిలవండి.. భారత్‌ను కోరిన మాల్దీవులు

భారత్‌-మాల్దీవుల మధ్య తాజా పరిణామాలపై చర్చించేందుకు ఇరు దేశాల అధికారులు మాలేలో సమావేశమయ్యారు. 

Updated : 14 Jan 2024 17:35 IST

మాలే: మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్న అభ్యర్థనపై ఇరు దేశాల అధికారులు (India-Maldives Conflict) ఆదివారం మాలేలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. మార్చి 15 నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని తమ అధ్యక్షుడు చెప్పినట్లు మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్‌కు తెలిపారు. దాంతోపాటు భారత్‌తో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా సమీక్షించనున్నట్టు ఆ దేశ సమాచార వ్యవహారాల మంత్రి ఇబ్రహీం ఖలీల్‌ స్థానిక వార్తా పత్రికకు వెల్లడించారు.  

మాల్దీవుల అధ్యక్షుడికి షాక్‌.. మాలె మేయర్‌ ఎన్నికల్లో భారత అనుకూల పార్టీ గెలుపు!

గతంలో మానవతా అవసరాల కోసం భారత్‌ ఇచ్చిన రెండు హెలికాప్టర్లను వినియోగించడం ఆపేయాలని అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 77 మంది భారత సైనిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ముయిజ్జు భారత్‌ను కోరారు.

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనా పర్యటనకు వెళ్లిన ఆయన పలు ఒప్పందాలు చేసుకున్నారు. శనివారం స్వదేశానికి వచ్చిన తర్వాత ఏ దేశం పేరు ప్రస్తావించకుండా కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరించడం తగదని, అందుకు ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదని అన్నారు. మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని