Maratha quota: మరాఠా కోటా ఆందోళనలు.. 3 జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత!

మరాఠా కోటా ఉద్యమం (Maratha Quota Agitation) పలుచోట్ల హింసాత్మకంగా మారుతోంది. శాంతి భద్రతల దృష్ట్యా జల్నాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ (Curfew) విధించడంతో పాటు స్థానికంగా బస్సు సేవలను నిలిపివేశారు.

Published : 26 Feb 2024 14:49 IST

ముంబయి: మనోజ్‌ జారంగే నేతృత్వంలో కొనసాగుతోన్న మరాఠా కోటా ఉద్యమం (Maratha Quota Agitation) పలుచోట్ల హింసాత్మకంగా మారుతోంది. జల్నాలోని ఓ ఆర్టీసీ బస్సుకు ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు.. జల్నాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ (Curfew) విధించారు. అటు ఎంఎస్‌ఆర్టీసీ కూడా స్థానికంగా బస్సు సేవలను నిలిపివేసింది.

మరోవైపు జల్నా, ఛత్రపతి శంభాజీనగర్‌, బీడ్‌ జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలు (Internet Services) నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయన్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ మూడు జిల్లాల సరిహద్దులను కూడా మూసివేసినట్లు తెలిపారు.

అంతర్వాలి సారథి గ్రామంలో నిరసన తెలుపుతున్న మరాఠా కోటా ఉద్యమనేత మనోజ్‌జారంగే.. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్‌ ఇంటికి ర్యాలీగా వెళ్తానని ప్రకటించడంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు అంతర్వాలి సారథి గ్రామానికి చేరుకొనే అవకాశం ఉందని.. అందుకే ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు స్థానిక కలెక్టర్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే, తనను చంపడానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్‌ ప్రయత్నిస్తున్నారని మనోజ్‌ జారంగే పేర్కొన్న విషయం తెలిసిందే. జల్నాలోని అంతర్వాలి సారథి గ్రామంలో ఆదివారం చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. మహారాష్ట్ర కోటా బిల్లు ఆమోదం పొందిన అనంతరం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. దీనివెనక ఉప ముఖ్యమంత్రి ఫఢ్నవీస్‌ ఉన్నారంటూ ఈక్రమంలో ముంబయిలోని ఫఢ్నవీస్‌ ఇంటికి ర్యాలీగా వెళ్తానని జారంగే ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని